పంద్రాగస్టుతో షురూ చేసే స్త్రీ శక్తి టికెట్ ఇదేనట!
కూటమి సర్కారు చారిత్రక విజయాన్ని నమోదు చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏడాది తర్వాత కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చే విషయంలో కిందా మీదా పడుతోంది.;
ఎన్నికల వేళ.. అర్భాటంగా హామీలు ఇవ్వటం రాజకీయ పార్టీలకు మామూలే. కానీ.. ఇచ్చిన హామీల్ని అమలు చేసే వేళ ప్రభుత్వాలకు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయన్న దానికి నిదర్శనంగా ఏపీలోని కూటమి సర్కారును చెప్పొచ్చు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్న భారీ ఆఫర్ ఇవ్వటం తెలిసిందే.
కూటమి సర్కారు చారిత్రక విజయాన్ని నమోదు చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏడాది తర్వాత కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చే విషయంలో కిందా మీదా పడుతోంది. చివరకు ఈ హామీ అమలుపై సాగుతున్న జాగుపై ప్రజల్లోనూ విమర్శలు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో పంద్రాగస్టు నాడు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా ప్లానింగ్ జరుగుతోంది. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పథకానికి ‘స్త్రీ శక్తి’ పేరును డిసైడ్ చేయటం తెలిసిందే.
అయితే.. తెలంగాణ, కర్ణాటకలో మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచైనా ఎంత దూరమైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉంది. కూటమి సర్కారు మాత్రం మల్లగుల్లాలు పడుతోంది. కారణం.. ఈ హామీ అమలు భారీ ఖర్చుకు కారణం కావటమే. అందుకే కిందా మీదా పడుతూ.. పలు కాంబినేషన్లు ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి వస్తున్న సమాచారంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎన్నికల వేళలో ఎలాంటి కండిషన్ల గురించి చెప్పకుండా.. హామీని అమలు చేసే వేళలో మాత్రం పరిమితులు.. పరిధుల గురించి మాట్లాడటం సరికాదన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. తాజాగా స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అమలు చేసే పథకానికి సంబంధించిన టికెట్ బయటకు వచ్చింది. ఈ టికెట్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. డిపో పేరు.. స్త్రీశక్తి ప్రయాణించే ప్రదేశం.. చేరాల్సిన గమ్యస్థానంలాంటిఅంశాల్ని ప్రస్తావించటమే కాదు.. సదరు టికెట్ ధర ఎంత? రాయితీ ఎంత ఇస్తున్న విషయాన్ని చెప్పటం ద్వారా ప్రభుత్వ మైలేజీ పెంచుకునే ఎత్తుగడగా చెబుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన టికెట్ లో.. పైసా వసూలు చేయకుండా ఫ్రీగా టికెట్ ఇస్తామన్న విషయాన్ని ఎక్కువగా ఫోకస్ అయ్యేలా ‘‘0’’ బిల్లు పేరుతో ఇష్యూ చేసేలా టికెట్ ఉంది. మామూలుగా అయితే అయ్యే టికెట్ విలువను పేర్కొనటం ద్వారా.. ఈ పథకం కారణంగా తమకు ఎంత ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందన్న విషయం అందరికి అర్థమయ్యేలా చేస్తుందని చెప్పాలి.