శ్రీకృష్ణదేవరాయలు సమాధికి అపచారం.. సోషల్ మీడియా లేకుంటే?
శ్రీకృష్ణదేవరాయలు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని చక్రవర్తి.;
మిగిలిన దేశాలకు.. ఆ దేశ ప్రజలకు మనకు ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. ఎన్నో దేశాలు తమ చరిత్రకు .. స్మారక చిహ్నాలకు.. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు..వారికి సంబంధించిన అంశాలకు ఇచ్చే ప్రాధాన్యత ఎంతో ఎక్కువ. ఆ విషయంలో మనం ఎంత వెనుకబడి ఉన్నామన్నది మాటల్లో కూడా చెప్పలేనిది. అదంతా ఒక ఎత్తు అయితే.. ఉన్నది కాపాడుకోవటం.. గౌరవం తగ్గకుండా చూసుకోవటం లాంటివి మచ్చుకుకూడా కనిపించవు.
శ్రీకృష్ణదేవరాయలు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని చక్రవర్తి. ఆంధ్రభోజుడైన ఈ మహారాజ సమాధి హంపీ - ఆనెగుంది ప్రాంతాల మధ్య పారుతున్న తుంగభద్ర నదీ తీరంలో ఉంది. తాజాగా ఈ సమాధికి అపచారం జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారటం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది. 64 స్తంభాలతో నిర్మించిన రాయల సమాధిని పురావస్తుశాఖ సంరక్షిత స్మారకంగా ప్రకటించటం తెలిసిందే.
పేరుకు ప్రకటనే తప్పించి.. దాన్ని సంరక్షించటం ఎక్కడా కనిపించదు. తాజాగా ఆ సమాధిలోకి చొరబడటమే కాదు.. ఆ సమాధిపైన పొట్టేలు గొంతు కోసి.. కళేబరాన్ని స్తంభానికి కట్టి చర్మం వలుస్తున్న వీడియో వైరల్ గా మారింది. దీనిపై చరిత్రకారులు.. కన్నడపర సంఘటనల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండటంతో ఈ సమాధి పరిధిలోకి వచ్చే గంగావతి పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఆనెగుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైనా పర్వదినాలు.. జాతరలు వచ్చిన సందర్భంలో ఇలా సమాధిపైన జంతువధ చేయటం పరిపాటిగా మారింది. తాజాగా (ఆదివారం) ఆనెగుందిలో జాతర జరిగింది. తర్వాతి రోజు స్థానికులు కొందరు శ్రీకృష్ణదేవరాయల వారి సమాధిపైన జంతువధ చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావటంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గామారింది.ఈ దారుణానికి పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. వారిని పట్టుకొని కేసు నమోదు చేస్తామని చెబుతున్న వైనం బాగానే ఉన్నా.. దాని కంటే ముందు.. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా చర్యలు ఎందుకు తీసుకోరు అన్నది అసలు ప్రశ్న.