చేతులు కలుపుతున్న చిన్న పార్టీలు.. ఎఫెక్ట్ ఎంత ..!
రాష్ట్రంలో చిన్న పార్టీలుగా ఉన్నవి.. వచ్చే ఎన్నికల నాటికి చేతులు కలపాలని నిర్ణయించాయా? వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని భావిస్తున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.;
రాష్ట్రంలో చిన్న పార్టీలుగా ఉన్నవి.. వచ్చే ఎన్నికల నాటికి చేతులు కలపాలని నిర్ణయించాయా? వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని భావిస్తున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. దీనికి జై భీం భారత్ పార్టీ చీఫ్, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా గుంటూరు వేదిగా నిర్వహించిన కీలక సమావేశంలో చిన్న పార్టీలన్నీ ఏకం కావాలని.. పెద్దపార్టీల ఓటు బ్యాంకును చీల్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది.
ఏయే పార్టీలు..
వీటిలో రివల్యూషన్ కాంగ్రెస్ పార్టీ, జై భీం భారత్ పార్టీలు ముందు వరుసలో ఉన్నాయి. వీటితో పాటు.. బీసీవై పార్టీని కూడా కలుపుకొనేందుకు చర్చలు చేస్తున్నాయి. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్‌పీ వంటి వాటిని కూడా కలపుకొని వెళ్లాలని నిర్ణయించాయి. ప్రస్తుతం జై భీంభారత్ పార్టీ తరఫున జడ శ్రవణ్‌కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. ఇక, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలోని రివల్యూషనరీ కాంగ్రెస్ పార్టీ, బోడే రామచంద్రయాదవ్ నేతృత్వంలోని బీసీవైలు చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఆప్ సహా.. బీఎస్‌పీలు.. తమ తమ అధిష్టానాలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నాయి.
ఓటు బ్యాంకు ఎంత?
ఈ చిన్నా చితకా పార్టీలకు పెద్దగా ఓటు బ్యాంకు లేకపోయినా.. ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని జై భీం భారత్, రివల్యూషనరీ కాంగ్రెస్ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఎస్సీలను సెంట్రిక్‌గా చేసుకుని రాజకీయాలు చేస్తున్నాయి. అదే సమయంలో బీసీల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన బీసీవై పార్టీ ని కలుపుకొనే ప్రయత్నంలో ఉన్నాయి. తద్వారా.. రాజకీయంగా 10 శాతం ఓటు బ్యాంకును ప్రభావితం చేసేలా అడుగులు వేస్తున్నాయి. గత ఎన్నికల్లో జై భీం భారత్ రాష్ట్ర వ్యాప్తంగా 120 స్థానాల్లో పోటీ చేసింది.
రివల్యూషన్ పార్టీ కూడా 100 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. అయితే.. అప్పటికి.. వచ్చే ఎన్నిక లకు మధ్య వ్యత్యాసం ఉంటుందని భావిస్తున్న ఈ పార్టీలు.. ప్రస్తుత పరిణామాలను అంచనా వేసుకుని.. తాము బలమైన పక్షంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ఇది.. వైసీపీకి దెబ్బ కొట్టే అవకాశం ఉందని టీడీపీ, కాదు.. టీడీపీ సహా కూటమిని ఇబ్బంది పెట్టవచ్చని వైసీపీ లెక్కలు వేస్తున్నాయి. ఏదేమైనా.. చిన్నపార్టీలు చేతులు కలిపినా.. పెద్దపార్టీలకు వచ్చే నష్టం ఏమీ ఉండదన్న అంచనా కూడా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.