షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష... ఆసక్తికరంగా వాట్ నెక్స్ట్?
అవును... బంగ్లాదేశ్ కోర్టు బుధవారం షేక్ హసీనాకు కోర్టు ధిక్కార కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించిందని స్థానిక మీడియా నివేదించింది.;
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు ఆరు నెలల జైలు శిక్షపడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లాదేశ్ న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించిందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ఐసీటీ) ఈ తీర్పును వెలువరించింది. దీంతో.. ఈ విషయం సంచలనంగా మారింది. తదుపరి పరిణామాలు ఏమిటనేది మరింత ఆసక్తిగా మారింది.
అవును... బంగ్లాదేశ్ కోర్టు బుధవారం షేక్ హసీనాకు కోర్టు ధిక్కార కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించిందని స్థానిక మీడియా నివేదించింది. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయ్యిన షేక్ హసీనాతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి.
అయితే.. పదవి కోల్పోయిన అనంతరం దేశం విడిచి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం.. హసీనాకు విధించాల్సిన శిక్షను అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ లోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నిర్ణయించింది. దీనికి చైర్మన్ జస్టిస్ ఎండీ గోలం మోర్టుజా మొజుందర్ నాయకత్వం వహిస్తున్నారు. హసీనా అరెస్టు అయిన లేదా లొంగిపోయిన రోజు నుండి ఆమెకు విధించిన శిక్ష అమలులోకి వస్తుందని తెలిపారు.
ఈ కేసులో ఈమెతో పాటు గోవిందగంజ్ కు చెందిన షకీల్ అకాంత్ బు ల్బుల్ కు కూడా రెండు నెలల జైలు శిక్ష విధించింది. బుల్బుల్.. ఢాకాకు చెందిన అవామీ లీగ్ విద్యార్థి విభాగం అయిన బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ (బీసీఎల్)తో సంబంధం కలిగి ఉన్న రాజకీయ నాయకుడుగా ఉన్నారు.
కాగా... గత ఏడాది ఆగస్టు 5న హసీనా భారతదేశానికి వచ్చేసిన సంగతి తెలిసిందే! అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో... ఆమె పదవీచ్యుతి చెందిన మూడు రోజుల తర్వాత.. నోబెల్ గ్రహీత 85 ఏళ్ల ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక పరిపాలనకు నాయకత్వం వహించడానికి నియమించబడ్డారు.