'ఉదయం పూజ.. మధ్యాహ్నం ఇంజెక్షన్.. రాత్రి మాత్రలు'

42 ఏళ్ల వయసులో ఆకస్మికంగా మరణించిన నటి షఫాలీ జరివాలా ఉదంతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.;

Update: 2025-07-01 07:26 GMT

42 ఏళ్ల వయసులో ఆకస్మికంగా మరణించిన నటి షఫాలీ జరివాలా ఉదంతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మరణంపై ముంబయి పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో యాంటీ ఏజింగ్ మందుల్ని ఖాళీ కడుపుతో వినియోగించటం కూడా ఆమె మరణానికి కారణమన్న వాదన పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ క్రమంలో పోలీసులు ఆమె మరణంపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఇప్పటివరకు జరిగిన విచారణలో వెలుగు చూసిన అంశాలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. వీటికి సంబంధించిన అంశాల్ని చూస్తే..

శుక్రవారం షఫాలీ ఉపవాసం ఉన్నారని.. ఆమె ఆ రోజు పూజ చేసినట్లుగా పోలీసులు చెప్పారు. ఖాళీ కడుపుతో పలు రకాల మెడిసిన్స్ ను ఆమె ఉపయోగించిన కారణంగా రక్తపోటు పడిపోయి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ కడుపుతో శుక్రవారం ఉదయం పూజ చేసిన షఫాలీ.. మధ్యాహ్నం యాంటీ ఏజింగ్ కు సంబంధించిన ఇంజెక్షన్ తీసుకున్నారని.. రాత్రివేళ ఆమె సాధారణ మోతాదులో మాత్రలు వేసుకున్నట్లుగా పేర్కొన్నారు.

రాత్రి వేళలో షెఫాలీ బీపీ బాగా పడిపోవటం.. ఆమెకు వణుకు మొదలైనట్లుగా చెప్పిన పోలీసులు.. ఆమె కుప్పకూలిన వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినట్లుగా పేర్కొన్నారు. నటి మరణంపై దర్యాప్తు పోలీసులు ఇప్పటివరకు షఫాలీ భర్త.. తల్లిదండరులు.. ఇంటి పని మనిషితో పాటు మొత్తం పది మంది వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లుగా పేర్కొన్నారు. వీరంతా షఫాలీ ఇంట్లో కుప్పకూలిన సమయంలో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అనుమానాస్పద అంశాన్ని గుర్తించలేదని చెబుతున్నారు.

ఫోరెన్సిక్ సైన్సెస్ నిపుణులు ఆమె ఇంటికి వచ్చి మందులు..ఇంజెక్షన్ శాంపిల్స్ ను సేకరించారు. ఈ కేసు దర్యాప్తు సాగుతుందని.. పోస్టు మార్టం రిపోర్టు కోసం చూస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. గ్లామర్ కోసం అతిగా మెడిసిన్స్ వాడటం.. తగిన జాగ్రత్తలు తీసుకోపోవటం ఎలాంటి విపరిణామాలకు దారి తీస్తుందన్న దానికి షఫాలీ ఉదంతం ఒక ఉదాహరణగా పేర్కొంటున్నారు.

Tags:    

Similar News