శశిథరూర్ కి నిజంగానే ఆ రెండు సంఘటనలు గుర్తు లేవా?

అవును... ఐదు దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-05-29 04:30 GMT

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో శశిథరూర్ వ్యవహారశైలిపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే! ఆయన రోజు రోజుకీ బీజేపీ నేతగా రూపాంతరం చెందుతున్నారనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఓ కీలక పరిణామం నెలకొంది.. దీంతో, ఆయన పార్టీ సహచరుడు ఉదిత్ రాజ్.. శశిథరూర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అవును... ఐదు దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. పనామాలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. 2016లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ ల సందర్భంగా భారత్ తొలిసారిగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయిందని అన్నట్లు వార్తలొచ్చాయి!

దీంతో.. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా స్పందించిన ఉదిత్ రాజ్... "డియర్ శశిథరూర్.. మిమ్మల్ని బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా నియమించేలా మీరు ప్రధాని మోడీని ఒప్పించగలిగితే బాగుండేది.. మీరు భారత్ కు తిరిగి వచ్చేలోగానే మిమ్మల్ని విదేశాంగ మంత్రిగా ప్రకటించగలిగితే ఇంకా బాగుండేది అని అన్నారు.

మోడీ ప్రధాని కాకముందు భారత్ ఆధీనరేఖను దాటిపోలేదని మీరు అన్నారు.. ఫలితంగా కాంగ్రెస్ భవ్యచరిత్రను అప్రతిష్టపాలు చేశారని ఉదిత్ రాజు ఫైరయ్యారు. 1965లో పాకిస్థాన్ లోని లాహోర్ సెక్టారులోని పలు ప్రాంతాల్లోకి భారత్ చొచ్చుకుపోయింది.. ఇక, 1971లో పాకిస్థాన్ ను భారత్ రెండుగా విడగొట్టింది అని గుర్తుచేశారు.

ఇదే సమయంలో.. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా అనేక సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారని.. అయితే, ఆ విజయాల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు అప్పట్లో డప్పు వాయించుకోలేదని ఉదిత్ రాజ్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దీంతో... విదేశాల నుంచి వచ్చిన తర్వాత శశిథరూర్ అధికారికంగా తీసుకోబోయే నెక్స్ట్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది!

Tags:    

Similar News