షర్మిల వ్యూహం ఏమిటో అర్ధంకావటంలేదే

మొత్తానికి షర్మిల వైఖరితో ఇటు వైసీపీ అటు టీడీపీలో గందరగోళం పెరిగిపోతోంది.;

Update: 2024-01-25 05:07 GMT

కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న షర్మిల వ్యూహం ఏమిటో అర్ధంకావటంలేదు. ఒకరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలుపుకుని వెళ్ళేట్లుగా మాట్లాడుతారు. మరోరోజు ఇటు జగన్ తో పాటు అటు చంద్రబాబునాయుడును నోటికొచ్చినట్లు మాట్లాడుతారు. ఇంతకీ షర్మిల బాధ, వ్యూహం ఏమిటో అర్ధంకావటంలేదు. అభివృద్ధిని చూసే విషయంలో తమతో పాటు ప్రతిపక్షాలన్నీ కలిసి వస్తాయని ఏకపక్షంగా ప్రకటించేశారు. అంటే టీడీపీ, జనసేనను కాంగ్రెస్ తో కలిపే తీసుకొస్తానని చెప్పేశారు.

ప్రభుత్వం జరిగిన అభివృద్ధిని గనుక చూపిస్తే దాన్ని చూడటానికి అందరం కలిసొస్తామని ప్రతిపక్షాల నేతలతో మాట్లాడకుండా షర్మిల ఏకపక్షంగా ప్రకటించేందుకు లేదు. మరుసటిరోజు మాట్లాడుతు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో కూడా విచ్చలవిడిగా అప్పులు జరిగిందని, రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చేయలేదని మండిపోయారు. అంటే చంద్రబాబుకు షర్మిల మిత్రపక్షమా లేకపోతే శతృపక్షమా అన్నదే అర్ధంకావటంలేదు. ఒక విషయం మాత్రం బాగా ప్రచారం జరుగుతోంది.

అయితే రెండుపార్టీల మధ్య అసలు ఏమి జరుగుతోంది అన్నది మాత్రం అర్ధంకావటంలేదు. కేంద్రప్రభుత్వానికి జగన్, చంద్రబాబు అమ్ముడుపోయారంటు ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోసారేమో ఇద్దరు కేంద్రప్రభుత్వానికి భయపడుతున్నారంటు రెచ్చిపోయారు.

ప్రత్యేకహోదా గురించి అడిగితే చంద్రబాబు జైల్లో పెట్టించారని, అధికారంలోకి వచ్చిన జగన్ స్వలాభం చూసుకున్నారంటు మండిపోయారు. మొత్తానికి షర్మిల వైఖరితో ఇటు వైసీపీ అటు టీడీపీలో గందరగోళం పెరిగిపోతోంది.

బహుశా షర్మిలకు కావాల్సింది కూడా ఇదేనేమో. పై రెండుపార్టీల్లో అయోమయం సృష్టించటమే షర్మిల టార్గెట్ అయ్యుంటుంది. అయితే షర్మిల మరచిపోయిన విషయం ఏమిటంటే జగన్ అయినా, చంద్రబాబు అయినా తనకన్నా రాజకీయంలో బాగా ముదిరిపోయారని.

తాత్కాలికంగా షర్మిల ఆరోపణలు, విమర్శలు రెండుపార్టీల్లో అయోమయం సృష్టించవచ్చేమో కాని ఫైనల్ దెబ్బమాత్రం కాంగ్రెస్ మీద గట్టిగా పడటం ఖాయం. ఎందుకంటే శవాసనంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని లేపటానికి షర్మిల విఫలయత్నం చేస్తున్నారు కాబట్టే.


Tags:    

Similar News