మైక్రోసాఫ్ట్ బాస్ 'మినప పునుగుల' ముచ్చట : ఏపీ రుచులకు బిల్ గేట్స్ ఫిదా

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ పర్యటన ముగిసింది.;

Update: 2026-02-16 12:14 GMT

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ పర్యటన ముగిసింది. ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు మంత్రి లోకేశ్ నాయకత్వంలో మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆహ్వానం పలికారు. ఆ తర్వాత ఆర్టీజీసీఎస్ సెంటర్ ను పరిశీలించిన బిల్ గేట్స్ సచివాలయ సమావేశ మందిరంలో మంత్రులు, సెక్రటరీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రులు, సెక్రటరీలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.



 


ఇక సచివాలయం నుంచి తిరుగు ప్రయాణంలో ఉండవల్లిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు కోసం రైతులు వాడుతున్న టెక్నాలజీని ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక స్థానిక మహిళలు బిల్ గేట్స్ కోసం ప్రత్యేకంగా చేసిన ‘మినప పునుగులు’ను బిల్ గేట్స్ రుచిచూశారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పునుగుల బ్రేక్ ఫాస్ట్ ను ఎంతో ఇష్టంగా తింటారు. టెక్ దిగ్గజానికి కూడా తమ రుచి చూపించారు. వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన బిల్ గేట్స్ కు మహిళలు సంప్రదాయం ప్రకారం నుదుట బొట్టు పెట్టి హారతులిచ్చారు. ఆ తర్వాత ప్రత్యేకంగా తయారు చేసిన పునుగులను రుచి చూడాల్సిందిగా కోరారు. మహిళలు అడిగిన వెంటనే కాదనకుండా బిల్ గేట్స్ వాటిని తిని బాగున్నాయంటూ కితాబునిచ్చారు.



 


అనంతరం వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతికత, ఏఐ ఆధారిత రైతు సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ పరిశీలించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని ఉన్న అరటి తోటలో సాంకేతిక వినియోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. వ్యవసాయం-అనుబంధ రంగాల్లో దిగుబడి పెంపు, సాగు ఖర్చు తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. నాణ్యమైన పంట ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక కార్యాచరణ అవలంభించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో అనలిటిక్స్, మానిటరింగ్ డాష్‌బోర్డులు వినియోగిస్తున్నామని వెల్లడించారు.



 


ఈ సందర్భంగా మహిళా రైతులు మణి, అన్నపూర్ణ... ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించిన ఏపీఏఐఎంఎస్ రైతు యాప్‌ గురించి గేట్స్‌కు తెలియజేశారు. ఈ యాప్ ద్వారా ఏ పంటలు పండించాలి, సాగునీటి నిర్వహణ, నేల స్వభావం, ధరలు, మార్కెట్ సమాచారం, పురుగు మందుల నియంత్రణ వంటి విషయాలు సులభంగా తెలుసుకుంటున్నామని చెప్పారు. ఏఐ ద్వారా పంట తెగుళ్ల గుర్తింపు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే డ్రోన్ సేవలు పొంది పురుగు మందులను వినియోగిస్తున్న తీరును తెలిపారు. బిల్ గేట్స్ సమక్షంలోనే రైతులు ఏఐ టూల్ ఉపయోగించి, వ్యాధి సోకిన మొక్క ఫోటో తీసి అప్లోడ్ చేశారు. ఆ వ్యాధిని ఏఐ గుర్తించి నివారణ సూచనలు అందించింది.



 


అనంతరం డ్రోన్ సేవను బుక్ చేయగా, మొక్కకు వ్యాధి వ్యాపించిన చోట డ్రోన్ స్ప్రే చేసింది. ఇది స్వయంగా చూసిన బిల్ గేట్స్ రైతులకు ఏఐ-అగ్రి టెక్ సేవలు అత్యద్భుతంగా అందిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మరోవైపు స్థానిక రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. మొదటగా వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన వివిధ రకాల పంటలను గేట్స్ పరిశీలించారు. అనంతరం ఢిల్లీకి పయనమయ్యారు. గేట్స్ పర్యటన సాఫీగా సాగిపోవడంపై ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేసింది.



 


Tags:    

Similar News