షాకింగ్ ట్రెండ్: 5 ఏళ్లలో 9 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదిలేశారు… కారణాలేమిటి?
ఒకప్పుడు కేవలం విదేశాలకు వెళ్లి చదువుకుని.. సంపాదించి తిరిగి మాతృభూమికి రావాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.;
ఒకప్పుడు కేవలం విదేశాలకు వెళ్లి చదువుకుని.. సంపాదించి తిరిగి మాతృభూమికి రావాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కేవలం విదేశాలకు వెళ్లడమే కాదు.. ఏకంగా భారత పౌరసత్వాన్ని వదులుకుని అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోవాలని భారతీయులు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా గణాంకాలు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. గత ఐదేళ్ల కాలంలో సుమారు 9 లక్షల మంది భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లను వదులుకుని విదేశీయులుగా మారిపోయారు.
ఏడాది వారీగా గణాంకాలు.. పెరుగుతున్న గ్రాఫ్
కరోనా సంక్షోభం తర్వాత భారతీయులు విదేశీ పౌరసత్వం తీసుకోవడంలో వేగం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో సుమారు 1,44,000 మంది పౌరసత్వం వదులుకున్నారు.. కోవిడ్ ఆంక్షల వల్ల తగ్గుదల 2020లో 85,302 మంది తగ్గారు. 2021 1,63,370 మంది, 2022లో 2,25,620 మంది అత్యధికంగా పౌరసత్వం వదిలేశారు. ఇక 2023లో 2,16,219 మంది, 2024లో 2,06,000+ మంది ఇండియాకొచ్చేశారు. మొత్తంగా 2019 నుండి ఇప్పటివరకు దాదాపు 9 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వీడారు. 2022లో ఈ సంఖ్య రికార్డు స్థాయిలో 2.25 లక్షలకు చేరుకోవడం గమనార్హం.
భారత పౌరసత్వాన్ని ఎందుకు వదులుకుంటున్నారు?
ఈ భారీ వలసలకు.. పౌరసత్వ మార్పిడికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. అధిక వేతనాలు.. ఆర్థిక భద్రత లేకపోవడం ప్రధాన కారణం. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో లభించే భారీ జీతాలు, మెరుగైన ఆర్థిక వృద్ధి అవకాశాలు యువతను ఆకర్షిస్తున్నాయి. కాలుష్య రహిత వాతావరణం, మెరుగైన ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం భారతీయులు విదేశీ పౌరసత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
భారతదేశంలో 'రెండు దేశాల పౌరసత్వం' పొందే వెసులుబాటు లేదు. దీనివల్ల వేరే దేశ పౌరసత్వం తీసుకోవాలంటే తప్పనిసరిగా భారత పౌరసత్వాన్ని వదులుకోవాల్సి వస్తోంది. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న విద్యార్థులు, అక్కడ కోర్సు పూర్తవ్వగానే వెంటనే ఉద్యోగాల్లో చేరుతున్నారు. కొన్నేళ్ల తర్వాత అక్కడి పౌరసత్వం తీసుకోవడం సులభం కావడంతో వారు మాతృదేశానికి తిరిగి రావడం లేదు.
బ్రెయిన్ డ్రెయిన్.. దేశానికి నష్టమా?
దేశంలోని మేధావులు, ప్రతిభావంతులైన యువత ఇలా పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్లిపోవడాన్ని నిపుణులు “బ్రెయిన్ డ్రెయిన్” మేధో వలసగా అభివర్ణిస్తున్నారు. ఐఐటీలు, ఐఐఎంల వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకున్న వారు విదేశీ కంపెనీలకు సేవలందించడం దేశాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని కొందరి ఆందోళన. అయితే దీనికి మరో కోణం కూడా ఉంది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు అక్కడి నుంచి పంపే విదేశీ మారక ద్రవ్యం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతాన్నిస్తోంది. అలాగే విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న భారతీయులు దేశానికి పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికతను తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది.
భారతదేశం గ్లోబల్ పవర్‌గా ఎదుగుతున్న తరుణంలో మన దేశంలోని టాలెంట్‌ను ఇక్కడే నిలుపుకోవడానికి మరిన్ని ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో దేశీయ మానవ వనరుల వినియోగంపై ప్రభావం పడే అవకాశం ఉంది.