ఊసరవెల్లి కూడా చంద్రబాబు వద్దే రంగులు మార్చడం నేర్చుకుంది- ష‌ర్మిల

సీఎం అయ్యాక చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అన్నారని, అస‌లు హోదాతో ఏం వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించార‌ని షర్మిల గుర్తు చేశారు.;

Update: 2024-02-26 16:27 GMT

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. ఒకే సారి అటు చంద్ర‌బాబు, ఇటు జ‌గ‌న్‌ల‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి విభ‌జ‌న హామీల్లో కీల‌క‌మైన హోదా రాకపోవడానికి ప్రధాన కారణం ఓవైపు చంద్రబాబు అయితే, మరోపక్క ప్ర‌స్తుత సీఎం జగన్ అని నిప్పులు చెరిగారు. ఇద్దరూ కలిసి బీజేపీ మెడలు వంచి ఉండి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేద‌ని వ్యాఖ్యానించారు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబుపై మ‌రిన్ని ఎక్కువ విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ''ఊసరవెల్లి కూడా చంద్రబాబు వద్దే రంగులు మార్చడం నేర్చుకుంది'' అని వైఎస్ షర్మిల అన్నారు.

సీఎం అయ్యాక చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అన్నారని, అస‌లు హోదాతో ఏం వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించార‌ని షర్మిల గుర్తు చేశారు. ఎవరైనా ప్రత్యేక హోదా కోసం నిరసనలు చేస్తే వారిపై కేసులు పెట్టి జైల్లోకి తోయించారని ఆరోపించారు. ఈ మేర‌కు అనంతపురం జిల్లాలో ఏపీ కాంగ్రెస్ నిర్వ‌హించిన స‌భ‌లో ష‌ర్మిల ఆవేశంగా మాట్లాడారు. ''పోరాడదాం.. సాదిద్ధాం నినాదం''తో ప్ర‌త్యేక హోదా సాధిద్దామ‌ని పిలుపునిచ్చారు.

2019కి ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు, ధర్నాలు చేశారని షర్మిల గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు అందరం మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని జగన్ పిలుపు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, అధికారంలోకి వ‌చ్చాక‌.. బీజేపీకి సాగిల‌ప‌డ్డార‌ని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను జగన్ తెస్తారని ప్రజలు నమ్మి ఓటేస్తే.. అధికారంలోకి వచ్చాక ఒక్కసారి అయినా ఉద్యమం చేశారా అని నిల‌దీశారు. ''ఇప్పుడున్న ఎంపీలతో మూకుమ్మడి రాజీనామాలు ఎందుకు చేయించలేదు? కనీసం బెదిరించలేదు? అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరూ ప్రత్యేక హోదాను విస్మరించారు. ప్రత్యేక హోదా రానందునే ఏపీకి పరిశ్రమలు రాలేదు.

అందుకే యువతకు ఉద్యోగాలు కూడా రాలేదు. చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ బీజేపీతో అంటకాగారు. ఆ పార్టీకి బానిసలుగా మారారు. బీజేపీకి మనకు ఏం ఇచ్చింది? మనకు ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే.. ఎలా పొత్తులు పెట్టుకున్నా అడిగేవారు కాదు. కానీ, ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తున్నా కూడా ప్రశ్నించకపోగా.. అదే పార్టీతో పొత్తులు పెట్టుకుంటుంటే.. ప్రజలకు ద్రోహం చేస్తున్నట్లు కాదా?'' అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News