ఒకే వేదికపై షర్మిల, బొత్స.. విజయవాడలో అరుదైన కలయిక!

విజయవాడ నగరంలో శుక్రవారం ఓ ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఒకే వేదికపై కనిపించారు;

Update: 2025-09-13 05:15 GMT

విజయవాడ నగరంలో శుక్రవారం ఓ ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఒకే వేదికపై కనిపించారు. అంతేకాకుండా ఈ ఇద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వైసీపీని తీవ్రంగా విమర్శిస్తున్న పీసీసీ చీఫ్ షర్మిల ఆ పార్టీకి చెందిన ప్రధాన నాయకుడితో ఒకే వేదిక పంచుకోవడం, ఆత్మీయంగా మాట్లాడం కొత్త రాజకీయ సమీకరణలకు తెర లేస్తుందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.

విజయవాడలో విశాఖ ఉక్కుపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి పీసీసీ చీఫ్ షర్మిల, మాజీ మంత్రి బొత్స తదితరులు హాజరయ్యారు. ముందుగా సమావేశానికి వెళ్లిన బొత్స.. షర్మిల రావడం చూసి లేచి నిలబడి ఆమెను సాదరంగా గౌరవించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా తన పక్కనే కూర్చొమని షర్మిలకు కుర్చీ చూపారు బొత్స. ఇక సమావేశంలో కూడా ఇద్దరు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. కార్యక్రమం అనంతరం బొత్సకు నమస్కరిస్తూ ‘అన్నా వెళ్లొస్తా’ అంటూ షర్మిల చెప్పారు. ఇదంతా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

వైసీపీ అధినేత జగన్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మధ్య గడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అనుకూల వర్గాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి బొత్స వెళ్లడం విశేషంగా చెబుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొంత కాలంగా ఉద్యమిస్తున్నారు. కార్మికులకు బాసటగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీపైనా ఆమె ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత బొత్స మాత్రం విశాఖ ఉక్కును తాము అడ్డుకుంటున్నామని చెబుతున్నారు. ఇదే సమయంలో తమ పార్టీపై విమర్శలు చేస్తున్న షర్మిల వైఖరిని గతంలో ఆయన తప్పుపట్టారు.

ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుపై నిర్వహించిన సమావేశానికి బొత్స, షర్మిల హాజరవడం రాజకీయంగా చర్చనీయంశంగా మారింది. ప్రతి విషయంలోనూ పరస్పరం విభేదించుకుంటున్న వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు విశాఖ ఉక్కు విషయంలో ఒకటి అవుతున్నాయా? అనే చర్చ జరుగుతోంది. ఈ కలయిక విశాఖ ఉక్కు వరకు పరిమితమవుతుందా? మునుముందు మరన్ని అంశాల్లో కలిసి పనిచేసే అవకాశం ఉందా? అనే సందేహాలకు తెరతీస్తోంది. అయితే ఈ చర్చకు ముందు రౌండు టేబుల్ సమావేశానికి బొత్స వైసీపీ నేతగా పార్టీ అనుమతితో వచ్చారా? లేక ఉత్తరాంధ్ర ప్రాంత నాయకుడిగా ఆ ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించేందుకు తన అభిప్రాయాలను మేధావులతో పంచుకునేందుకు వెళ్లారా? అనేది స్పష్టత రావాల్సివుందని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ షర్మిల, బొత్స ఆత్మీయ కలయిక రాజకీయంగా అత్యంత ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.

Tags:    

Similar News