డిఫాక్టో సీఎంగా ధనుంజయ రెడ్డి? అంతులేని అధికారానికి కేరాఫ్ అడ్రస్

అధికారం అందరి చేతుల్లో ఉండదు. అరుదైన సందర్భాల్లో అనూహ్య రీతిలో దఖలు పడే అధికారాన్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అంత మంచిది;

Update: 2025-05-17 04:14 GMT

అధికారం అందరి చేతుల్లో ఉండదు. అరుదైన సందర్భాల్లో అనూహ్య రీతిలో దఖలు పడే అధికారాన్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అంత మంచిది. అందుకు భిన్నంగా కన్ను కాలు కానక ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారు.. ఆ తర్వాతి కాలంలో పడే ఇబ్బందులు అన్నిఇన్ని కావు. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్ వ్యవహరించినప్పటికి.. పాలన మొత్తం ఆయనకు కార్యదర్శిగా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డినే చూసుకునే వారన్న మాట బలంగా వినిపించేది. ప్రభుత్వం మారిన అనంతరం ఆయన లీలలపై ఫోకస్ చేసిన నేపథ్యంలో వెలుగు చూస్తున్న భాగోతాలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి.

ప్రస్తుతం మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన రిటైర్డు ఐఏఎస్ అధికారి నడిపించిన హవా ఎంతన్న విషయాలు బోలెడన్ని బయటకు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు ధనుంజయ్ రెడ్డినే డిఫాక్టో సీఎంగా వ్యవహరించారని.. ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కాదు మొత్తం అధికార యంత్రానికి ఆయన మాటే శాసనంగా చెబుతారు. దీనికి ఒక్క ఉదాహరణ తెలిస్తే చాలు.. ఆయన రేంజ్ ఏమిటి? ఆయన నడిపిన అధికార హవా ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వం మొత్తం నడిచేది సీఎస్ పేరు మీదనే. అలాంటి సీఎస్ కంటే చాలా చిన్న అధికార హోదా ఉన్న ధనుంజయ్ రెడ్డి.. కొన్ని పాలనాపరమైన అంశాలకు సంబంధించి తనను కలిసేందుకు వస్తే.. వెయిట్ చేయించటం ఆయనకే చెల్లుతుంది.

సాధారణంగా అయితే.. ధనుంజయ్ రెడ్డి స్థాయి ఉన్నోళ్లు.. సీఎస్ వద్దకు వెళ్లాలి. కానీ.. ముఖ్యమంత్రి కారణంగా మొత్తం అధికారాలు తనకు దఖలు పర్చుకున్న ధనుంజయ్ రెడ్డి.. సీఎస్ ను తన చాంబర్ బయట వెయిట్ చేయించటమేకాదు.. ‘‘సీఎస్ ను రమ్మని నేనేమైనా చెప్పానా? ఆయనకు పనుంది కాబట్టి భుజాన వేసుకొని వస్తున్నారు. నన్ను కలవాల్సిన అవసరం ఉంది ఆయనకు. అందుకే వెయిట్ చేస్తారు’ అంటూ నోరు పారేసుకునే తత్త్వం ధనుంజయ్ రెడ్డిలో టన్నుల కొద్దీ ఉంటుందని చెబుతారు.

జూనియర్ అధికారి మొదలు సీఎస్ వరకు.. ఎస్పీ నుంచి డీజీపీ వరకు.. చివరకు ఎమ్మెల్యే.. ఎంపీ.. మంత్రులు అయినా సరే ఆయన ముందు క్యూ కట్టాల్సిందే. ఆయన కరుణ కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. జగన్ కు అంతరాత్మలా వ్యవహరిస్తూ కనీవినీ ఎరుగని అధికారాన్ని చెలాయించాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సీనియర్ మంత్రులు.. బొత్స లాంటి వారు సైతం నాటి ముఖ్యమంత్రి జగన్ ను కలిస్తే.. ధనుంజయ్ అన్నను కలవాలని చెప్పటంతో వారికి మరో మార్గం లేకుండా పోయేదని చెబుతున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలైనా.. పార్టీకి సంబంధించిన అంశాలైనా..రాజకీయ ప్రత్యర్థుల సంగతి చూడాలన్నా.. ఇలా అది ఇది అన్న తేడా లేకుండా అన్నీ అంశాల్ని ఆయనే చూసే వారు. చివరకు అధికారుల బదిలీలు మొదలు.. సెటిల్ మెంట్ల వరకు.. ఆ మాటకు వస్తే ఎన్నికల్లో అభ్యర్థుల కేటాయింపు అంశంలోనూ కీలకభూమిక పోషించే వారన్న విషయం తాజాగా బయటకు వస్తోంది. వ్యవస్థలన్నింటిని తన గుప్పిట్లో పెట్టుకున్న అతను.. సాగించిన ఆరాచకాలు అన్నిఇన్ని కావని చెబుతారు.

ఇక్కడో షాకింగ్ అంశాన్ని ప్రస్తావించాలి. నిజానికి ఆయన ఐఏఎస్ అధికారి అయిన విషయంపైనా ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటు అయిన ధనుంజయ్ రెడ్డి మూలాలు ఉమ్మడి కడప జిల్లాతో మొదలైంది. రాయచోటి మండలం చెన్నముక్క పల్లెకు చెందిన ఆయన 1988లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో ఆ పంచాయితీకి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ గా పని చేస్తూనే డానిక్స్ సర్వీసుకు ఎంపికయ్యారు. ఢిల్లీ.. అండమాన్.. నికోబార్.. లక్ష ద్వీప్.. దమన్ దీవ్.. దాద్రానగర్ హవేలికి సంబంధించిన సర్వీసు. తన ఉద్యోగంలో భాగంగా ఢిల్లీలో ఉన్నప్పటికీ వైఎస్ తో మాత్రం తన సంబంధాన్ని కొనసాగించారు. ఆయన ఆర్థిక లావాదేవీల్ని ధనుంజయ్ చక్కబెట్టేవారని చెబుతారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. ఉమ్మడి ఏపీకి డిప్యుటేషన్ మీద వచ్చి.. దాదాపు ఎనిమిదేళ్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గా పని చేశారు. తర్వాత ఆయన్ను రాష్ట్ర సర్వీసులో విలీనం చేసుకునేలా చక్రం తిప్పారు. ఎనిమిదేళ్లు డిప్యూటీ డైరెక్టర్ హోదా పోస్టులో పని చేస్తే ఐఏఎస్ కు ఎంపిక కావొచ్చన్న క్లాజ్ తో ఐఏఎస్ అయ్యారు. సాంకేతికంగా చూస్తే అందులో తప్పు లేదన్నట్లు అనిపించినా.. నైతికంగా మాత్రం సరికాదంటారు. ధనుంజయ్ రెడ్డి డానిక్స్ లో ఉంటే ఎప్పటికీ ఐఏఎస్ కాలేకపోయారని చెబుతారు.

2014-19లో టీడీపీ ప్రభుత్వంలో గోదావరి పుష్కరాలకు ప్రత్యేకాధికారిగా పని చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. వైఎస్ హయాంలో చక్రం తిప్పిన ఆయన.. టీడీపీ హయాంలోనూ కీలక పోస్టుల్లో పని చేశారు. ప్రభుత్వానికి విధేయుడిగా ఉన్నట్లే కనిపిస్తూ.. తెర వెనుక మాత్రం వైసీపీకి పని చేసేవారన్న విమర్శలు ఉన్నాయి. ఇలా ధనుంజయ్ రెడ్డి లీలలు ఎన్ని చెప్పినా తక్కువే అని చెబుతారు. చివరకు విపక్ష నేతల్ని అరెస్టు చేయటం.. వారిని జైలుకు తరలించే క్రమంలో ట్విస్టులు అన్నీ ఆయన స్క్రీన్ ప్లేగా చెబుతారు. ఇలా నమ్మి చేతిలో పెట్టిన అధికారాన్ని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డి తీరు తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News