యూఎస్ ఫుడ్ ఫెస్టివల్ కాల్పుల ఇష్యూలో షాకింగ్ అంశం వెలుగులోకి?
ఈ మూడు రోజులు ఫుడ్ ఉచితంగా అందిస్తారు. ఈ ప్రఖ్యాత ఫుడ్ ఫెస్టివల్ కు దాదాపు 3.5 లక్షల మంది ఫుడ్ లవ్వర్స్ హాజరవుతారని అంచనా.
భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఆరున్నర గంటలకు..అదే సమయంలో అమెరికాలోని సియాటెల్ నగరంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ప్రఖ్యాత బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ ఫెస్టివల్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు బలి కాగా.. నలుగురు గాయపడిన వైనం షాకింగ్ గా మారింది. 1982 నుంచి ప్రతి ఏడాది నిర్వహించే ఈ ఫుడ్ ఫెస్టివల్ ను మూడు రోజుల పాటు నిర్వహిస్తుంటారు.
ఈ మూడు రోజులు ఫుడ్ ఉచితంగా అందిస్తారు. ఈ ప్రఖ్యాత ఫుడ్ ఫెస్టివల్ కు దాదాపు 3.5 లక్షల మంది ఫుడ్ లవ్వర్స్ హాజరవుతారని అంచనా. ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగే ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈసారి జరిగిన కాల్పుల కారణంతో తీవ్ర విషాదానికి గురైంది. తొలుత విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల ఉదంతంగా భావించగా.. అందుకు భిన్నమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కాల్పుల ఉదంతం ఒక గ్యాంగ్ వార్ గా పోలీసులు గుర్తించారు.
ఒక గ్యాంగ్ కు చెందిన వారు మరో గ్యాంగ్ కాల్పులు జరపటం.. ఈ క్రమంలో ఒక గ్యాంగ్ కు చెందినోళ్లు మరణిస్తే.. మరో ఇద్దరు సాధారణ పౌరుల ప్రాణాలు పోయిన దుస్థితి. పోలీసుల అంచనా ప్రకారం ఈ దారుణ ఉదంతంలో కనీసం ముగ్గురు షూటర్లు పాల్గొన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఆహ్లాదభరితంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. భయాందోళనలకు గురైన వారంతా పరుగులు తీశారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో పలువురు కింద పడిపోయిన దుస్థితి.
ఈ కాల్పుల ఉదంతంలో మొత్తం ఏడుగురు బుల్లెట్ గాయాల పాలు కాగా.. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు ఈ గ్యాంగ్ వార్ కు ఏ మాత్రం సంబంధం లేని వారిగా తేల్చారు. మరణించిన ఇద్దరిలో ఒకరు 44 ఏళ్ల పురుషుడు కాగా.. మరొకరు 56 ఏళ్ల మహిళగా గుర్తించారు. మరణించిన మరో 19 ఏళ్ల కుర్రాడు ఈ గ్యాంగ్ ల్లో ఒకడిగా భావిస్తున్నారు. కాల్పులకు కారణమైన వారిలో ఒక మైనర్ బాలుడ్ని (15 ఏళ్లు) పోలీసులు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జువెనైల్ హోంకు తరలించారు.అతడిపై అక్రమ ఆయుధాల వినియోగం.. ఫస్ట్ డిగ్రీ అస్సాల్ట్ కింద కేసులు నమోదు చేశారు.
ఈ విషాద ఉదంతాన్ని సియాటెల్ మేయర్ కేటీ విల్సన్ తీవ్రంగా ఖండించారు. సంతోషంగా సాగుతున్న అనుబంధాల వేడుకను ఇలా హింసతో ముగించటాన్ని తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. ఘటనాస్థలానికి దగ్గర్లో ఉన్న సీసీ కెమేరాల ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు.. అసలేం జరిగిందన్న అంశంపై ఆరా తీసుకున్నారు. ఇందుకు తాము సేకరించిన సీసీ కెమేరా ఫుటేజ్ ను విశ్లేషిస్తున్నారు. ఈ విషాదానికి కారణమైన మూడో షూటర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మూడున్నర లక్షల మంది వచ్చే ఈ పెద్ద ఈవెంట్ వేళ.. భద్రతాపరమైన లోపాల్నిచూపిస్తూ తప్పు పడుతున్నారు. ఆయుధాల తనిఖీ వ్యవస్థ లేని కారణంగానే పదిహేనేళ్ల మైనర్ బాలుడు సైతం సులువుగా ఆయుధాలతో ఫుడ్ ఫెస్టివల్ ప్రాంతానికి చేరుకున్నారని చెప్పాలి. భద్రతా లోపాలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాం వ్యక్తమవుతోంది.