40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. ఢిల్లీ, బెంగళూరులో కలకలం

ఢిల్లీ పోలీసులకు వచ్చిన ఈ-మెయిలులో ‘‘హలో నేను పలు స్కూళ్లలో బాంబులను అమర్చాను. వాటిని బయటకు కనిపించకుండా దాచాను.;

Update: 2025-07-18 08:14 GMT

దేశంలోని ప్రధాన నగరాల్లో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీతోపాటు సిలికాన్ వ్యాలీ బెంగళూరులో పాఠశాలల్లో బాంబులు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు ఈ మెయిల్ బెదిరింపులు పంపారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడును రంగంలోకి దింపారు. దాదాపు 40 పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. తొలుత ఢిల్లీలోని 20 పాఠశాలలకు బెదిరింపు మెయిల్ వచ్చింది. రోహిణి సెక్టార్-3లోని అభినవ్ పబ్లిక్ స్కూల్ లో వీటిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత పశ్చిమ విహార్ లోని రిచ్మాండ్ గ్లోబల్ స్కూల్ కు బెదిరింపులు అందాయి. దీనికి గత మూడు రోజుల్లో రెండుసార్లు ఇలాంటి హెచ్చరికలు వచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

ఢిల్లీ పోలీసులకు వచ్చిన ఈ-మెయిలులో ‘‘హలో నేను పలు స్కూళ్లలో బాంబులను అమర్చాను. వాటిని బయటకు కనిపించకుండా దాచాను. ఒక్కర్ని కూడా వదిలిపెట్టను. అందరినీ అంతం మొందిస్తా, టీవీల్లో బాంబు పేలుడు సమాచారం చూసి ఆనందిస్తా., ఆ వెంటనే చేయి, గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను.’’ అంటూ పేర్కొన్నాడు. అయితే ఇవి నకిలీ బెదిరింపులుగా పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆయా పాఠశాలల్లో విద్యార్థులను బయటకు పంపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గత వారం రోజుల్లో నాలుగు సార్లు ఈ బాంబు బెదిరింపులు రావడంతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

ఇక బెంగళూరులోనూ బాంబు బెదిరింపులతో నకిలీ ఈ-మెయిల్స్ వచ్చాయి. రాజేశ్వరీ నగర్, కెంగీరీ ప్రాంతాల్లో 20 స్కూళ్లలో బాంబులు అమర్చినట్లు ఈ మెయిల్ లో పోలీసులకు హెచ్చరికలు అందాయి. దీంతో వెంటనే బాంబు డిస్పోజబుల్ స్వ్కాడ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ స్కూల్లకు బెదిరింపులు వచ్చిన కొద్ది సేపట్లోనే బెంగళూరు స్కూళ్లను పేల్చివేయనున్నట్లు బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే ఈ బెదిరింపు మెయిల్స్ అన్నీ ఒకే ఐపీ నంబరు నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, మూడు రోజుల క్రితమే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ను పేల్చివేస్తామని హెచ్చరికలు వచ్చాయి. కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో ఉన్న మెయిల్ ఐడీ నుంచి ఈ బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసు విచారణలో ఆ బెదిరింపు ఉత్తదేనని తేలింది.

Tags:    

Similar News