రాజకీయ సుడిలో 'స్వామి ప్రసాదం'
ఏపీలోని తిరుమల శ్రీవారి ప్రసాదం మాదిరిగానే.. కేరళలోని శబరిమలలో ఉన్న స్వామి అయ్యప్ప ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా అంతే ప్రాధాన్యం ఉంది.
ఏపీలోని తిరుమల శ్రీవారి ప్రసాదం మాదిరిగానే.. కేరళలోని శబరిమలలో ఉన్న స్వామి అయ్యప్ప ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా అంతే ప్రాధాన్యం ఉంది. అయ్యప్ప ప్రసాదం సంవత్సరానికి మూడు మార్లు మాత్రమే విక్రయిస్తారు. తిరుమల శ్రీవారి ప్రసాదం అయినా.. ఏదో ఒక విధంగా భక్తులు సంపాయించుకునేందుకు అవకాశం ఉంది. కానీ, స్వామి ప్రసాదం అలా కాదు. ఒక్క శబరి మలలోనే విక్రయిస్తారు. అది కూడా.. ఏడాదికి మూడు సార్లు మాత్రమే. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. తాజాగా.. ఈ ప్రసాదం రాజకీయ వలలో చిక్కుకుంది. ఏకంగా ప్రభుత్వానికి, శబరి మల ఆలయం(ట్రావెన్‌కోర్) బోర్డుకు మధ్య వివాదాన్ని రాజేసింది. `మీరెంతంటే.. మీరెంత` అంటూ.. ఇరు పక్షాలు విమర్శలు చేసుకునే వరకు కూడా వెళ్లిపోయింది. చివరకు ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉందని ప్రభుత్వమే పేర్కొనడం గమనార్హం.
ఏం జరిగింది?
ప్రస్తుతం కన్నెమాసం(కేరళం ప్రకారం) జరుగుతోంది. ఈ సమయంలో స్వల్ప కాల వ్యవధిలో స్వామివారి దర్శనం కోసం ఆలయాన్ని తీస్తారు. మరో నాలుగు రోజుల్లో మూసి వేసే గడువు కూడా సమీపించింది. సుదీర్ఘ విరామం అనంతరం.. అయ్యప్ప స్వామికి ఫలహారం.. పూజల కోసం.. ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇది నిబంధన కూడా. ఒకప్పుడు ఈ మాసంలో పెద్దగా భక్తులు వచ్చేవారు కాదు. పైగా.. స్వామి దీక్ష అంటే.. కేవలం కార్తీక మాసంలోనే జరిగేది. అయితే.. ఈ దఫా కన్నె మాసంలోనూ.. భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తారు. దీనిని ముందుగానే ఊహించినప్పటికీ.. అనుకున్న స్థాయిలో దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేయలేక పోయింది. ఫలితంగా ప్రసాదాల కొరత ఏర్పడింది. దీంతో ఆదివారం, శనివారం వేల మంది భక్తులు ప్రసాదం లభించక ఉసూరు మన్నారు.
ఈ వ్యవహారాలు పత్రికల్లోనూ మీడియాలోనూ భారీ ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. దీంతో సర్కారు స్పందించింది. దేవస్థానం బోర్డు అధికారులు, పాలకమండలిపై దేవదాయ, పర్యాటక శాఖ మంత్రి మురళీధరన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తిని పడుకుంటున్నారని అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బోర్డు సభ్యులు ఏం దోచుకుందామా? అని ప్లాన్ చేస్తున్నారంటూ.. గతంలో వెలుగు చూసిన అయ్యప్ప బంగారం చోరీ ఘటనను పరోక్షంగా ప్రస్తావించారు. ఈ వ్యవహారం కాస్తా ముదిరింది. దీంతో బోర్డు కూడా తీవ్రంగా స్పందించింది. తమపై ప్రభుత్వానికి పెత్తనం లేదని.. తాము సర్వ స్వతంత్రులమని పేర్కొంది. అంతేకాదు.. ముందస్తు ఏర్పాట్లు చేశామని.. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తాము అంచనా వేయలేదని పేర్కొంది. అయినప్పటికీ ఏర్పాట్లు చేసినా.. సరిపోలేదని పేర్కొంది.
ఇదేసమయంలో బోర్డు సభ్యులు కీలక విషయాన్ని వెల్లడించారు. కొత్తగా మరో ప్రసాదాల తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇది మరింతగా ప్రభుత్వానికి, బోర్డుకు మధ్య గ్యాప్ పెంచేసింది. ఎవరిని అడిగి కొత్త నిర్మాణం ప్రారంభించారని.. మంత్రి నిలదీశారు. ఎవరు ప్లాన్‌కు అనుమతి ఇచ్చారని చెప్పారు. ప్రజలు సమర్పిస్తున్న విరాళాలను దోచుకునేందుకు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో బోర్డు కూడా.. మీకు సంబంధం లేదని.. తాము నిబంధనల ప్రకారం ఏం చేయాలో అదే చేస్తున్నామని పేర్కొంది. ఇక, ఈ వ్యవహారంపై సీఎంసతీశన్‌కు చెప్పి.. కేరళ హైకోర్టును ఆశ్రయిస్తామని మంత్రి వెల్లడించారు.
నియంత్రణ ఉండదా?
కేరళలో దేవదాయ చట్టం ఉన్నప్పటికీ.. అది శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి వర్తించదు. ఇది తరతరాలుగా రాజుల ఏలుబడిలో ముఖ్యంగా ట్రావెన్‌కోర్ ఆస్తానం ఏలుబడిలో సాగింది. ఈ పరిధిలోని దేవాలయాలు(అనంత పద్మనాభస్వామి ఆలయం కూడా) ట్రావెన్‌కోర్ రాజుల సమయంంలో అనుసరించిన విధానాలనే అనుసరిస్తున్నాయి. వారికి ప్రత్యేకంగా చట్టం ఉంటుంది. దీనిని గతంలోనూ సుప్రీంకోర్టు సమర్థించింది. అందుకే.. ప్రభుత్వాల జోక్యం నామమాత్రంగా ఉంటుంది. అయితే.. ఇది ఆలయం వరకే పరిమితం. భక్తులకు చేసే ఏర్పాట్లు, రవాణా సౌకర్యాల విషయంలో బోర్డు-ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుంటాయి.