ట్రంప్ గీ పెట్టినా.. రష్యా చమురు వద్దంటే.. చెరువు మీద అలిగినట్లే
ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడుతూ టారిఫ్ ల మీద టారిఫ్ లు విధిస్తున్న సంగతి తెలిసిందే;
ప్రపంచానికి పెద్దన్న అమెరికా అయితే.. చమురు పెద్దన్న రష్యా అనే చెప్పాలి. 1.72 కోట్ల చదరపు మైళ్ల విస్తీర్ణం... అంటే దాదాపు ఆరు భారత దేశాలతో సమానం... అంత పెద్దది రష్యా. ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశం. అంతెందుకు..? యూఎస్ఎస్ఆర్ (యునైటెడ్ సోషలిస్ట్ సోవిట్ యూనియన్)గా ఉన్న రష్యా నుంచి విడిపోయిన 15 దేశాల్లో కజకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి చాలా పెద్దవి. అందుకే ఒకప్పుడు రష్యా ప్రపంచాన్ని అమెరికాతో సమానంగా శాసించగలిగింది. ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికాను ఢీకొట్టింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యా బలహీన పడింది. దీనికి బలమైన నాయకత్వ లోపమూ కారణమే. అయితే, పుతిన్ వచ్చాక మాత్రం గత 25 ఏళ్లలో పరిస్థితి మారిపోయింది.
పాకిస్థాన్ సైతం..
రష్యా చమురు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడుతూ టారిఫ్ ల మీద టారిఫ్ లు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా భారత్ సహా పలు దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. దీంతో అసలు ఏమిటీ? రష్యా చమురు అనే ప్రశ్నలు వస్తున్నాయి.
యూరప్ లో పొయ్యి వెలగదు...
రష్యా ప్రపంచవ్యాప్తంగా 8వ అతిపెద్ద చమురు నిల్వలున్న దేశం. 80 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలున్న దేశం. 2023లోనే రష్యా చమురు ఉత్పత్తి రోజుకు దాదాపు 10.8 మిలియన్ బ్యారెళ్లు ఉత్పత్తి చేసింది. అంతెందుకు..? ఉక్రెయిన్ పై యుద్ధం మొదలయ్యాక రష్యాను అమెరికా సహా పాశ్చాత్య దేశాలు బెదిరించాలని చూశాయి. ఏకంగా పాకిస్థాన్ అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ రష్యాలో పర్యటించారు. రష్యాతో చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని కూడా ఇమ్రాన్ ప్రశ్నించారు. భారత్ కూడా రష్యా నుంచి చమురు కొంటున్న సంగతిని గుర్తుచేశారు. కానీ, అమెరికా ఆగ్రహానికి గురై పదవిని కోల్పోయారు.
-రష్యా చమురు మరీ ముఖ్యంగా యూరప్ నకు అత్యంత కీలకం. చలి దేశాలు కాబట్టి అక్కడ హీటర్ల వాడకం ఎక్కువ. ఒకవేళ రష్యాను బెదిరించాలని.. ఆ దేశం నుంచి చమురు కొనుగోలు ఆపేస్తే జర్మనీ వంటి దేశాల్లో పొయ్యి వెలగదనే చెప్పాలి.
-రష్యా కంటే ఎక్కువ చమురు నిల్వలున్న దేశాలు మరో ఏడు ఉన్నప్పటికీ.. వాటిలో జనాభా కారణంగా వినియోగం ఎక్కువ. ఎగుమతి సామర్థ్యం తక్కువ.
-ఉక్రెయిన్ పై యుద్ధం మొదలయ్యాక రష్యా చమురు కొనవద్దని భారత్ ను పాశ్చాత్య దేశాలు బెదిరించాయి. కానీ, దీనిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దీటుగా తిప్పికొట్టారు. తక్కువ ధరకు చమురు ఎక్కడ దొరికితే అక్కడ కొంటామని.. మరి మీరెందుకు గతంలో చమురు కొన్నారని టిట్ ఫర్ టాట్ లాగా సమాధానం ఇచ్చారు. మీరు మాకు నీతులు చెప్పొద్దంటూ వారి నోరు మూయించారు. ఇదీ రష్యా చమురు కథ.. అందుకే ఆ దేశంతో పెట్టుకుంటే చెరువుపై అలిగినట్లేనని చాలా దేశాలు మౌనంగా ఉంటాయి.