రుషికొండ ప్యాలెస్ పై వైసీపీ నేత బొత్స ఉచిత సలహా.. ఇలా ఎవరూ చెప్పి ఉండరేమో?
గత ప్రభుత్వంలో నిర్మించిన రుషికొండ భవనాలను ఏం చేయాలో తెలియడం లేదని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుపట్టిన వైసీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స ప్రభుత్వానికి ఉచిత సలహా ఇచ్చారు;
విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ పై వైసీపీ గళం విప్పింది. గత ప్రభుత్వంలో నిర్మించిన రుషికొండ భవనాలను ఏం చేయాలో తెలియడం లేదని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుపట్టిన వైసీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స ప్రభుత్వానికి ఉచిత సలహా ఇచ్చారు. రుషికొండ భవనాలను ఎలా వినియోగించాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతున్నందున తాను ఓ సలహా ఇస్తున్నానని అన్న బొత్స.. ఇటీవల గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు చేసిన వాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రుషికొండను సందర్శించిన సమయంలో పెచ్చులూడుతున్నాయని చెప్పడంపైనా ఘాటుగా స్పందించారు బొత్స.
కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి రుషికొండ ప్యాలెస్ ను బూచిగా చూపుతూ వైసీపీపై మాటల దాడి చేస్తోంది. అయితే తొలుత ఈ విషయంలో కాస్త ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిన వైసీపీ.. ఇప్పుడు ఎదురుదాడికి దిగుతోంది. తాజాగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స మాటలను పరిశీలిస్తే వైసీపీ కౌంటర్ అటాక్ తో ఈ విషయంలో ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. రుషికొండపై 450 కోట్లతో నిర్మించిన భవనాలను ఎందుకూ పనికి రావని ప్రభుత్వం చెపుతోంది. అప్పట్లో విశాఖను పరిపాలన రాజధాని చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం హరిత రిసార్ట్స్ ను తొలగించి నాలుగు విలాసవంతమైన భవనాలు నిర్మించారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేరువేరుగా పరిశీలించారు. ఈ భవనాల వినియోగంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ చేపట్టడంతోపాటు ప్రజాభిప్రాయాన్ని స్వీకరిస్తామని తెలిపారు. అయితే ఇందులో ప్రతిపక్షం వైసీపీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టే ప్రయత్నమే కూటమి నేతలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు రెండు రోజుల క్రితం విశాఖ పర్యటనకు వచ్చి, 450 కోట్లతో నిర్మించిన భవనాలను వృధాగా వదిలేసే బదులు పిచ్చాసుపత్రి చేయాలని సూచించారు. అంత డబ్బు పెట్టి ఎందుకు పనికిరాని భవనాలు నిర్మించే బదులు ఉత్తరాంధ్రలో సుజల స్రవంతి పథకం పూర్తి చేసే సరిపోయేదని, కానీ గత ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదని అశోక్ మండిపడ్డారు.
అయితే గవర్నర్ హోదాలో ఉన్న అశోక్ గజపతి రాజకీయాలు మాట్లాడటమేంటని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స ఘాటుగా స్పందించారు. పిచ్చాసుపత్రి చేయాలన్న అశోక్ గజపతికే మతి స్థిమితం సరిగా లేనట్లు ఉందని మండిపడ్డారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడొచ్చా? అంటూ ప్రశ్నించారు. ఇదే సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎత్తిచూపిన అంశాలపైనా బొత్స స్పందించారు. 450 కోట్లతో నిర్మించిన భవనం పెచ్చులూడుతున్నాయని ప్రభుత్వం చెప్పే బదులు, సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవచ్చు కదా? అంటూ నిలదీశారు. రుషికొండ భవనాలకు ఏ ప్రభుత్వంలో బిల్లులు చెల్లించారో కూడా బయటపెట్టాలని సవాల్ విసిరారు.
ఇదే సమయంలో ప్రభుత్వానికి తాను ఓ ఉచిత సలహా ఇస్తున్నట్లు బొత్స చెప్పారు. రుషికొండ భవనాలను వృధాగా వదిలేసే బదులు డెస్టినేషన్ మ్యారేజ్ లకు ఇస్తే ఏడాదికి కనీసం రూ.25 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు చాలా మంది వివాహాల కోసం రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు వెళుతున్నారని, అంతదూరం వెళ్లే బదులు రుషికొండ భవనాలను పెళ్లిళ్ల నిర్వహణకు వినియోగించడం బెటర్ అంటూ బొత్స చెప్పారు. బొత్స స్పందనతో కూటమి ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంతవరకు వైసీపీలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ఎవరూ ఇలా మాట్లాడలేదని అంటున్నారు. ఒక్క బొత్స మాత్రమే ప్రభుత్వ విమర్శలకు కౌంటరుగా గట్టి సమాధానమిచ్చారంటున్నారు. ఏటా 8 కోట్ల ఆదాయం వచ్చే భవనాలను కూల్చి ఎందుకూ పనికిరాని భవనాలను నిర్మించారని ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని బొత్స రూ.25 కోట్ల సలహాతో తిప్పికొట్టారని అంటున్నారు.