తీరంలో ఘోరం.. మయన్మార్ లో 427 మంది మృతి.. అసలేమైంది?

అవును... మయన్మార్ తీరంలో రెండు ఓడలు మునిగిపోవడంతో సుమారు 427 మంది ముస్లిం రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.;

Update: 2025-05-24 07:07 GMT

మయన్మార్ తీరంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకొంది. ఇందులో భాగంగా... రెండు ఓడలు మునిగిపోవడంతో సుమారు 427 మంది రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది! మే 9, 10 తేదీల్లో ఈ ఘోర ప్రమాదాలు జరిగినట్లు వెల్లడించింది! ఈ రెండు ఓడ ప్రమాదాల్లోనూ సుమారు 87 మంది బతికి బయటపడినట్లు తెలుస్తోంది.

అవును... మయన్మార్ తీరంలో రెండు ఓడలు మునిగిపోవడంతో సుమారు 427 మంది ముస్లిం రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ విషయం పూర్తిగా నిర్ధారణ అయితే ఈ ఏడాది ఇప్పటివరకూ రోహింగ్యా శరణార్థులకు సంబంధించిన సముద్రంలో జరిగిన అత్యంత ఘోరమైన విషాదం ఇదే అవుతుందని ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా స్పందించిన ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ (యూ.ఎన్.హెచ్.సీ.ఆర్)... ఈ నెల ప్రారంభంలో మయన్మార్ తీరంలో రెండు ఓడ ప్రమాదాల నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఓ ప్రకటనలో తెలిపింది! ఈ ప్రమాదాలకు సంబంధించిన ఖచ్చితమైన పరిస్థితులను నిర్ధారించడానికి మరింత కృషి చేస్తున్నామని తెలిపింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం 267 మందితో కూడిన ఒక నౌక మే 9న ముగినిపోయిందని.. అందులో 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని తెలిపింది! అనంతరం.. మే 10న 247 మంది రోహింగ్యాలతో వెళ్తున్న మరో నౌక బోల్తా పడగా అందులో కేవలం 21 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించింది.

వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్ లో నివసిస్తుంటారు. ఈ క్రమంలో.. అక్కడ సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాది మంది 2017లో బంగ్లాదేశ్ కు తరలిపోయారు. ఈ క్రమంలో మయన్మార్ లో గతేడాది సైనిక తిరుగుబాటు అనంతరం ఆ వలసలు మరింత పెరిగాయి. దీంతో.. దక్షిణ బంగ్లాదేశ్ లో శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి.

ఫలితంగా అక్కడి పరిస్థితులు క్షీణించడంతో వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు వలసబాట పడుతున్నారు. దీనికోసం ప్రమాదకర సముద్ర ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. యూ.ఎన్.హెచ్.సీ.ఆర్. లెక్కల ప్రకారం 2024లో ఈ ప్రాంత జలాల్లో సుమారు 657 మంది రోహింగ్యాలు మరణించారు. దీనిపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది!

Tags:    

Similar News