''బనకచర్ల'' బెంబేలు.. తెలంగాణలో సవాళ్ల రాజకీయం!
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి భారీ సవాల్ రువ్వారు.;
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి భారీ సవాల్ రువ్వారు. ''నీ ఇష్టం. నీకు నచ్చిన రోజు రెడీగా. అసెంబ్లీ పెడతం. గోదావరి జలాలపై నువ్వు ఏం చేశావో.. మేం ఏం చేశామో.. చర్చిద్దాం'' అని సవాల్ రువ్వారు. కేసీఆర్.. చర్చకు వస్తవా?! అని నిలదీశారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి జలాల వ్యవహారం రాజకీయ రచ్చ రేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ ఎస్ నాయకులు.. రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తన గురువు, ఏపీ సీఎం చంద్రబాబుకు మేలు చేస్తున్నాడని.. బీఆర్ ఎస్ కీలక నాయకులు విమ ర్శిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని కర్నూలు జిల్లాలో నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణలోను, ఇటు రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా తీవ్ర వివాదం అయింది. బనక చర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఏపీ తరలించుకుని పోయేందు కు రెడీ అయిందని.. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వంనిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కవిత, కేటీఆర్ సహా ఇతర నేతలు ఆరోపిస్తున్నారు. గోదావరి జలాలను తామే రక్షించామని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు రెండు రాష్ట్రాలూ కూర్చుని చర్చించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా దాదాపు ఓకే చెప్పారు. అయితే.. ఇంతలోనే బీఆర్ ఎస్ నాయకులు గోదావరి జలాలపై లాలూచీ వ్యవహారం చేసేందుకే గురు శిష్యులు ప్రయత్నిస్తున్నారంటూ.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తాజాగా స్పందిస్తూ.. గోదావరి జలాల విషయంలో చర్చించేందుకు కేసీఆర్ ముందుకు రావాలని సవాల్ రువ్వారు.
ఆయన చెప్పిన రోజే.. అసెంబ్లీ నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖరాయాలని ఆయన సూచించారు. అవసరమైతే.. ఒక్కరోజు కాదు.. ఎన్ని రోజులైనా ఈ విషయంపై చర్చిద్దామని చెప్పారు. మరి దీనిపై బీఆర్ ఎస్ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.