వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేస్తున్న రేవంత్ రెడ్డి.. రీజనేంటి?
మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వరుసగా పర్యటనలు చేసిన రేవంత్ రెడ్డి.. పలు సందర్భాల్లో వైఎస్ పేరును ప్రస్తావించారు.;
గత రెండు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సోమవారం లేదా మంగళవారం.. తెలంగాణలో మునిసిపల్, కార్పొరేషన్‌లకు ఎన్నికల షెడ్యూల్ రానుంది. దీనిని పురస్క రించుకుని ఆయన జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే.. గతానికి భిన్నంగా.. తాజాగా తన జిల్లాల పర్యటనల్లో చేస్తున్న ప్రసంగాల్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేస్తున్నారు.
మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వరుసగా పర్యటనలు చేసిన రేవంత్ రెడ్డి.. పలు సందర్భాల్లో వైఎస్ పేరును ప్రస్తావించారు. మహబూబ్ నగర్‌లో పర్యటించినప్పుడు.. పాలమూరు అభివృద్ధి వైఎస్ హయాంలోనే బీజం పడిందని.. తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు.. దీనిని పట్టించుకోలేద న్నారు. ఫలితంగానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టారన్నారు. కాంగ్రెస్‌కు పేరు వస్తుందన్న దుగ్ధతోనే ఇలా చేశారని మండిపడ్డారు.
నల్లగొండలో పర్యటించినప్పుడు కూడా వైఎస్‌పేరును ప్రస్తావించారు. ఇక్కడి ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్ హయాంలోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇక, తాజాగా ఆదివారం ఖమ్మంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు తొలిసంతకం.. ఈ ఫైలుపైనే చేశారని గుర్తుచేశారు.
అదేవిధంగా ప్రజలకు అందుబాటులోకి వైద్యాన్ని తెచ్చిన ఘనత కూడా తమదేనన్నారు. 108 వాహనాల ను ప్రవేశపెట్టి రాజీవ్ ఆరోగ్య శ్రీని తీసుకువచ్చామన్నారు. తర్వాత వచ్చిన కేసీఆర్.. వీటిని నాశనం చేసే ప్రయత్నాలు చేశారని విమర్శలు గుప్పించారు. ఇలా.. గత రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ జపం చేస్తున్నారు. దీనికి మునిసిపల్ ఎన్నికలే రీజనై ఉంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదేసమయంలో కేసీఆర్ సర్కారును కూడా ఆయన ఎండగడుతున్నారు. మొత్తానికి ఎన్నికల వ్యూహంలో భాగంగానే రాజశేఖరరెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారని సమాచారం.