జీవన్‌రెడ్డి ఎఫెక్ట్.. రేవంత్ రెడ్డి జాగ్రత్తలు!
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.;
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. హుటాహుటిన ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవన్ రెడ్డి ఈనెల 25న అధికారికంగా బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఆయనతో కలిసి పనిచేయడం దేవుడు ఇచ్చిన అవకాశం అని కూడా వ్యాఖ్యానించారు.
దీంతో క్షేత్రస్థాయిలో జీవన్ రెడ్డి చేరిక వ్యవహారం ఆసక్తిగా మారింది. ఫలితంగా వేలాదిమంది కార్యకర్తలతో అయినా బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా స్పందించారు. క్షేత్రస్థాయిలో జగిత్యాల నుంచి సుమారు 22 బస్సులు పెట్టి కార్యకర్తలను, నాయకులను హుటాహుటిన హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. వారితో చర్చలు జరిపారు. పార్టీ అందరికీ మేలు చేస్తుందని, జీవన్ రెడ్డితో ఎవరూ వెళ్ళరాదని సూచించారు.
జీవన్ రెడ్డి పార్టీకి ఒకరకంగా నమ్మకద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. పార్టీ ఆయనకు అన్ని అవకాశాలు ఇచ్చిందని సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు కీలక పదవి ఇవ్వాలని కూడా భావించామన్నారు. కానీ, ఇంతలోనే బీఆర్ఎస్ మాయలో పడి ఆయన వెళ్లిపోయారని అన్నారు. ఆయన చేసిన తప్పులు మీరు ఎవరు చేయవద్దని రేవంత్ రెడ్డి కార్యకర్తలకు కర్తవ్య బోధ చేశారు. అంతేకాదు 2023లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ విజయం సాధించినా జగిత్యాలలో ఆయన ఓడిపోయారని దీనికి కారణాలు ఏమిటో ఆయన చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇదే సమయంలో జగిత్యాల నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎంఎల్ఏ ను పార్టీలోకి తీసుకోవడాన్ని తప్ప పడుతున్న జీవన్ రెడ్డి.. గతంలో టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. అంతేకాదు ఎన్టీఆర్‌కు ద్రోహం చేయాలన్న ఉద్దేశంతో నాదెండ్ల భాస్కర్ రావుతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని కూల్చడంలో కూడా జీవన్ రెడ్డి కీలకపాత్ర పోషించారని ఆరోపించారు.
అయినప్పటికీ జీవన్ రెడ్డి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన నాయకులను పార్టీ వదిలించుకోవడం మంచిదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి వంటి వారికి భవిష్యత్తు లేదని అటువంటివారి వెనుక వెళ్లడం సరికాదని అన్నారు. కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్‌తోనే కలిసి ఉండాలని చెప్పడం విశేషం.