ఎవడు పడితే వాడు జర్నలిస్టు.. సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు
ఇదివరకు తమ భావజాలాన్ని ప్రజలకు వివరించేందుకు పత్రికలను నడిపేవారని.. ఇప్పుడు రాజకీయ పార్టీల పత్రికలు వింత పోకడలు పోతున్నాయని ఆరోపించారు.;
కాలంతో పాటే మీడియా రేంజ్ పెరుగుతోంది.. మొదట్లో పత్రికలు, తర్వాత టీవీలు, అనంతరం వెబ్ సైట్లు.. ఇప్పుడు సోషల్ మీడియా.. యూట్యూబ్ చానల్ పెట్టేసుకుని చాలామంది జర్నలిస్టులుగా ప్రచారం అవుతున్నారు. తమకు తోచిన వ్యూస్ ను ప్రసారం చేస్తున్నారు. ఇందులో మెయిన్ స్ట్రీమ్ మీడియా వెలుగులోకి తీసుకురాని, విశ్లేషించలేని అంశాలు ఉండొచ్చు. మొత్తంగా చూస్తే మాత్రం మీడియా పరిధి పెరిగినా.. ప్రొఫెషనలిజం ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంశాన్ని తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు.
హైదరాబాద్ లో ఓ పత్రిక పదో వార్షికోత్సవంలో పాల్గొన్న రేవంత్.. జర్నలిస్టులను ఉద్దేశించి షాకింగ్ కామెంట్లు చేశారు. మారుతున్న జర్నలిజం పోకడలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇదివరకు జర్నలిస్టులకు అన్ని రంగాలపైన పట్టు ఉండేదని గుర్తుచేశారు.
ఇదివరకు తమ భావజాలాన్ని ప్రజలకు వివరించేందుకు పత్రికలను నడిపేవారని.. ఇప్పుడు రాజకీయ పార్టీల పత్రికలు వింత పోకడలు పోతున్నాయని ఆరోపించారు. సంపాదనను కాపాడుకోవడానికి, తప్పులను కప్పిపుచ్చేందుకు కొన్ని రాజకీయ పత్రికలు పనిచేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. మొత్తానికి జర్నలిస్టు అనే పదానికి అర్థమే లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జర్నలిజంలో వింత పోకడలకు రాజకీయ పార్టీలు తోడైనట్లు రేవంత్ వివరించారు. వీరంతా వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. జర్నలిజం ముసుగులో కొందరు పార్టీల పత్రికల కోసం పనిచేస్తున్నారని దీన్ని ప్రజలు నిశితంగా గమనించాలని కోరారు. అసలు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో.. వారు సదస్సులు నిర్వహించి జర్నలిస్ట్ అనే పదానికి అర్థం చెప్పాలని రేవంత్ సూచించారు.
గతంలో సబ్జెక్ట్ జర్నలిస్టులు ఉండేవారని.. ప్రెస్ మీట్‌లలో తాము జాగ్రత్తగా మాట్లాడేవారని రేవంత్ తెలిపారు. జర్నలిస్టుల నుంచే వివరాలు తీసుకునేవాళ్లమని పేర్కొన్నారు. ఇప్పుడు ఎవడు పడితే వాడు జర్నలిస్టుగా చెలామణి అవుతున్నారని మండిపడ్డారు. అఆఇఈ రానోడు కూడా జర్నలిస్ట్ అని గొప్పలు పోతూ.. తన పేరు పక్కన ఇంటిపేరుగా తోక తగిలించుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు.