మూసీ ఫైట్: తగ్గేదేలే అంటున్న రేవంత్ రెడ్డి..
హైదరాబాద్ లోని మూసీ సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు.;
హైదరాబాద్ లోని మూసీ సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో విపక్షాలను ఏ మాత్రం లెక్క చేయని సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మూసీ పునర్జీవం ఆవశ్యకతను వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ కీలక సమావేశం నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్ లో జరిగిన ఈ సభలో తన మంత్రివర్గ సహచరులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, పర్యావరణ వేత్తలు, మేథావులు, అర్బన్ ఆర్కిటెక్టులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. మూసీ సుందరీకరణ ఆవశ్యకతతోపాటు ప్రాజెక్టుపై ప్రభుత్వ ఆలోచనలు, విపక్షాల విమర్శలతో పాటు పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వివరించారు.
మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తయారు చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుత హైదరాబాద్ నగరాన్ని 110 ఏళ్ల క్రితం నిర్మించారని, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని మరింతగా నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దేవతలు యజ్ఙం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేసినట్లు, ఇప్పుడు ప్రతిపక్షాలు తన మూసీ యజ్ఙాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఆర్థిక పురోగతి కోసమే మూసీ ప్రాజెక్టును చేపడుతున్నామని, ఎవరి ఆస్తులు గుంజుకోవడానికి కాదని రేవంత్ రెడ్డి చెప్పారు.
మూసీ సుందరీకరణను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దాదాపు పది వేల మంది నిరాశ్రయులను చేసే ప్రాజెక్టు అవసరమా? అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇక బీజేపీ కూడా ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. పేదల ఇళ్లు టచ్ చేయకుండా మూసీ అభివృద్ధి చేయాలని సూచిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒకేసారి రెండు ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ను పట్టించుకోలేదని, బీజేపీ కూడా 12 ఏళ్లలో నగరం కోసం ఏం చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. తాను మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా హైదరాబాద్ పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నానని, మూసీ విషయంలో ముందుకే వెళతానని చెబుతున్నారు.
దీంతో మూసీ సుందరీకరణ తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య తీవ్ర యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. మురికి నీటి కూపంలా మారిన మూసీని బాగు చేయాలని అన్ని పక్షాలు కోరుకుంటున్నాయి. అయితే ఆక్రమణలు తొలగించకూడదు, పేదలకు ముందు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే షరతులు విధిస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. విపక్షాల డిమాండ్లను తన నోటి నుంచే చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి, పది వేల మందికి ఎలా న్యాయం చేద్దామో చెప్పండి అంటూ విపక్షాలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని విమర్శిస్తున్న వారిపై అదేస్థాయిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటి? అంటూ సీఎం ప్రశ్నిస్తూ విమర్శకులను ఆత్మరక్షణలోకి నెడుతున్నారని అంటున్నారు.