కేసీఆర్ సైలెంట్...రేవంత్ స్పీడ్
తెలంగాణాలో రాజకీయాన్ని ఏకపక్షం చేసుకోవాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణాలో రాజకీయాన్ని ఏకపక్షం చేసుకోవాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయాల్లో అదను చూసి దెబ్బ తీయాలని సామెత ఉంది. విపక్షం వీక్ గా ఉన్నపుడే జోరు చేయాలని తెలిసిన వారే ముందుకు సాగుతారు. రేవంత్ రెడ్డి ఇపుడు అదే పంధాను అనుసరిస్తున్నారు. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అయితే గత రెండున్నరేళ్ళుగా ఫాం హౌజ్ లోనే ఉంటున్నారు. ఓటమి తరువాత ఎందుకో ఆయన మునుపటి మాదిరిగా దూకుడు చేయడం లేదు. దాంతో ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి పెద్ద అడ్వాంటేజ్ గా తీసుకుని స్పీడ్ పెంచేశారు అని అంటున్నారు.
బిగ్ డిబేట్ అంటూ సవాల్ :
రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికలు నేడో రేపో అన్నట్లుగా ఆయన హడావుడి చేస్తున్నారు. తాజాగా చూస్తే ఆయన బీఆర్ఎస్ కి బలం ఉంది అన్న చోట పాలమూరు లో పర్యటించారు. అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించడమే కాదు ఏకంగా కేసీఆర్ కే సవాల్ చేశారు. తన రెండున్నరేళ్ల పాలన కేసీఆర్ పదేళ్ల పాలనకు తేడా ఏంటో చర్చిద్దాం సిద్ధమేనా అని సవాల్ చేశారు. కేసీఆర్ చర్చకు రెడీ అంటే తాను కూడా రెడీ అన్నారు. అభివృద్ధి సంక్షేమం విషయంలో తాను బీఆర్ఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. ఇక ఈ మధ్య కాలంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని తమ ప్రభుత్వం ఏమి చేసిందో తాను చెబుతాను అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు.
జనంలోకి రాని వైనం :
కేసీఆర్ అయితే జనం లోకి రావడం లేదు. ఆయన గత డిసెంబర్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఒక రోజు శీతాకాల సమావేశాలకు అటెండ్ అయ్యారు. 2026 లో కొత్త ఏడాదిలో మూడు ప్రాంతాలలో మూడు భారీ బహిరంగ సభలు పెడతామని కూడా ప్రకటించారు. కానీ అవేమీ జరగలేదు. యధా ప్రకారం కేసీఆర్ ఫాం హౌజ్ కే పరిమితం అయిపోయారు. మరో వైపు బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వెళ్ళి కొత్త పార్టీని పెట్టుకుంది ఆమె బాణాలు బీఆర్ఎస్ మీదనే ఎక్కుపెడుతోంది. అదొక చికాకు అనుకుంటే హరీష్ రావు బీజేపీలో చేరిపోతున్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు మరో చికాకుగా మారాయి. వాటికి హరీష్ రావు ధీటుగా బదులిస్తూ ఖండిస్తున్నప్పటికీ జనంలో గులాబీ పార్టీ రేకులు విడిపోతున్నాయని చెప్పడానికే ఈ వ్యూహాత్మకమైన విమర్శలు అన్నది కూడా ఉంది.
ఇక కేటీఆర్ విమర్శలు కానీ ఆయన స్టేట్మెంట్స్ కానీ కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. తన మీదకు ఇద్దరు నాయకులను వదిలేశారని కానీ వారి వల్ల ఏమీ కాదని రేవంత్ రెడ్డి హరీష్ కేటీఆర్ లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గమనార్హం. తనకు సమ ఉజ్జీ కేసీఆర్ తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ కారని రేవంత్ రెడ్డి చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కేసీఆర్ ఇప్పటప్పట్లో వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదని అంటున్నారు. దాంతో రేవంత్ రెడ్డి దూకుడు రాజకీయం తెలంగాణాలో కొనసాగుతోంది. పైగా 2034 వరకూ మాదే అధికారం అని బల్ల గుద్ది మరీ రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
గులాబీ పార్టీలో నైరాశ్యం :
కేసీఆర్ అంటే మంచి మాటకారి, చతురుడు, ఆయన సభకు పెడితే వచ్చే ఇంపాక్ట్ వేరు. అందుకే ఆయన బయటకు రావాలని బీఆర్ఎస్ లో అంతా కోరుకుంటున్నారు. కానీ పెద్దాయన ఏమి ఆలోచిస్తున్నారో తెలియదు కానీ కేసీఆర్ వచ్చేది అయితే ఇప్పట్లో లేదని అంటున్నారు. దాంతో రాజకీయంగా కాంగ్రెస్ పైచేయిగా నిలుస్తోంది అన్న వేదన గులాబీ క్యాడర్ లో ఉంది కేసీఆర్ మాదిరిగానే మాటలలో దిట్ట అయిన రేవంత్ రెడ్డి జనంలో ఉంటూ చేసే హాట్ కామెంట్స్ ఎప్పటికపుడు కొత్త చర్చకు తావిస్తున్నాయి. మరి రెండేళ్ళలో ఎన్నికలు ఉన్న తెలంగాణాలో కేసీఆర్ వ్యూహమేంటో తెలియదు కానీ ఆయన అన్నీ ఆలోచించుకుని బరిలోకి దిగేలోపలే మొత్తం చక్కబెట్టేలా రేవంత్ రెడ్డి దూకుడు ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.