కేసీఅర్ జోస్యానికి రివర్స్ జోస్యం చెప్పిన రేవంత్
అసెంబ్లీకి రాను అని చెబుతున్న కేసీఆర్ కి ప్రతిపక్ష నాయకుడి పదవి కూడా ఇవ్వకూడదని అన్నారు.;
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద తాజాగా వేసిన సెటైర్లు వైరల్ అవుతున్నాయి. మూడు రోజుల క్రితం వరంగల్ వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. ఆ సభలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం కూడా చెప్పారు.
ఇక దానిని బదులు అన్నట్లుగా హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పెద్దాయన అని కేసీఆర్ మీద పవర్ ఫుల్ డైలాగులతో దాడి చేశారు. జీతాలు తీసుకుంటూ పనిచేయమన్న చట్టం ఎక్కడ ఉందో ఆయనే చెప్పాలని అన్నారు. కేసీఆర్ కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందని, ఆయన గత పదహారు నెలలలో ఏకంగా 65 లక్షలకు పైగా జీతం ప్రభుత్వం నుంచి తీసుకున్నారని అన్నారు.
అంతే కాదు కార్లు, భవనాలు సిబ్బంది పోలీసు పహారా ఇలా అన్నీ అనుభవిస్తూ అసెంబ్లీకి రాను అని చెప్పడమేంటి అని నిలదీశారు. సభకు రాని జనాల వద్దకు పోని కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. అటువంటి కేసీఆర్ తన ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడ ఉందని ఆయన అన్నారు.
అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారా అని ఆయన నిలదీశారు. ప్రతిపక్షం బలంగా ఉండాలని తాము కోరుకుంటామని అందుకే బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున బస్సులు అడిగితే అనుమతులు ఇచ్చామని అన్నారు. తీరా సభ పెట్టి ప్రజా సమస్యలు చర్చిస్తారు ప్రభుత్వానికి సూచనలు ఇస్తారని అనుకుంటే విమర్శినడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.
అసెంబ్లీకి రాను అని చెబుతున్న కేసీఆర్ కి ప్రతిపక్ష నాయకుడి పదవి కూడా ఇవ్వకూడదని అన్నారు. అలాగే ప్రభుత్వం చేసే మంచి పనులను మెచ్చుకునే విశాల హృదయం లేనపుడు లోపాలను ఎత్తి చూపే హక్కు ఎక్కడిది అన్నారు. కడుపు నిండా విషం పెట్టుకుని కేసీఆర్ వరంగల్ సభలో మాట్లాడారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్నో నెరవేర్చామని అమ్మ వారిని దర్శించుకోవాలన్నా అమ్మ దగ్గరకు వెళ్ళాలి అన్నా కూడా అణా పైసా ఖర్చు లేకుండా ఆడబిడ్డలు ఉచితంగా తెలంగాణా రాష్ట్రం నలుమూలలా తిరిగేలా ఏర్పాటు చేశామని అన్నారు. దాని కోసం ఏటా అయిదు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే మహిళలకు రైతులకు యువతతో సహా అన్ని వర్గాలకు తమ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అన్నీ చేస్తోందని అన్నారు.
అయినా ఓర్వలేని తనంతో చేసే విమర్శలను పట్టించుకోమని అన్నారు. ప్రజా పాలన అంటే కాంగ్రెస్ ది అని రేవంత్ గట్టిగా చెప్పారు. గత పదేళ్లలో తెలంగాణాను తెచ్చి ఒక కోతుల గుంపు చేతిలో పెట్టారని జనాలు అనుకునే ఓడించారని ఎద్దేవా చేశారు. మాది గొప్ప పార్టీ అని కేసీఆర్ అంటున్నారని డబ్బులు ఎక్కువగా ఉన్న పార్టీ మీదే కాబట్టి గొప్పదే అని వెటకారం చేశారు.
బయట ఎక్కడో ఒకసారి సభలలో మాట్లాడడం కాదు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్, రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ వంటి కీలకమైన అంశాలలో చర్చించేందుకు తాను రెడీ అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి కేసీఅర్ జోస్యానికి రివర్స్ లో జోస్యం చెప్పారు. వచ్చేది తమ ప్రభుత్వమే అన్న కేసీఆర్ కి అది జరగని పని అనేశారు రానున్న పదేళ్ళూ కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితమని అన్నారు పదేళ్ళకు పైగా కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుందని ఆయన చెప్పారు. అధికారం ఆశలేవీ పెట్టుకోవద్దని కేసీఆర్ కి సూచిస్తూ బీఆర్ ఎస్ రజతోత్సవ సభ ఉత్సాహాన్ని నీరు కార్చేశారు.