బిజేపీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. బ్రిటిషర్ల కంటే డేంజర్

ఎక్కడేం చెప్పాలో.. ఎక్కడ ఎలా నడుచుకోవాలో.. సిట్ట్యూవేషన్ కు తగ్గట్లు స్క్రిప్టు మార్చే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ప్రత్యేకంగా ఉంటుంది.;

Update: 2025-04-10 04:09 GMT

ఎక్కడేం చెప్పాలో.. ఎక్కడ ఎలా నడుచుకోవాలో.. సిట్ట్యూవేషన్ కు తగ్గట్లు స్క్రిప్టు మార్చే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ప్రత్యేకంగా ఉంటుంది. మిగిలిన కాంగ్రెస్ ముఖ్యనేతలు.. ముఖ్యమంత్రుల తీరుకు భిన్నంగా ఆయన వ్యవహారశైలి ఉంటుంది. ఓవైపు ముఖ్యమంత్రి హోదాలో తరచూ ఢిల్లీకి వెళ్లే ఆయన.. కేంద్రంతో తాము స్నేహపూర్వకంగా ఉంటామని చెబుతూ.. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టుల్ని ఓకే చేయించుకోవటంలో ముందుంటారు. అదే సమయంలో పార్టీ వేదికల మీద అదే బీజేపీపై నిప్పులు చెరుగుతారు.

తాజాగా అహ్మదాబాద్ లో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తున్న ‘న్యాయ్ పథ్’ సదస్సుకు హాజరైన సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటిషర్ల కంటే బీజేపీ నేతలు చాలా ప్రమాదకరమైన వారిగా అభివర్ణించారు. స్వాతంత్ర్యం కోసం బ్రిటిషోళ్లను తరిమి కొట్టినట్లే రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ వాదులంతా దేశంలోని బీజేపీని ఓడించి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

మహాత్మాగాంధీ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ నాయకత్వంలో ముందుకు తీసుకెళుతుంటే.. అందుకు భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం దేశ వ్యాప్తంగా గాడ్సే విధానాల్ని ప్రచారం చేస్తున్నట్లుగా మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు తరచూ ప్రస్తావించే సర్దార్ వల్లభాయ్ పటేల్ ను తన ప్రసంగంలోకి తెచ్చిన రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజా సదస్సు జరుగుతున్న గుజరాత్ రాష్ట్రాన్ని.. గుజరాతీయుల్ని ఆయన ప్రస్తావిస్తూ.. తమకు గుజరాత్ ప్రజలతోనూ.. వల్లభాయ్ పటేల్ వారసులతోనూ తెలంగాణ ప్రజలకు సంబంధం ఉందన్నారు. ‘దేశ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తెలంగాణకు రాలేదు. అప్పుడు మాకు స్వాతంత్ర్యం ప్రసాదించిన వల్లభాయ్ పటేల్ తో మాకు భావోద్వేగ బంధం ఉంది. వల్లభాయ్ పటేల్ మాకు స్వాతంత్ర్యం ఇస్తే.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు. పటేల్ భూమి నుంచి నేను ఒక్కటే చెబుతున్నా. మేం బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వం.. అడ్డుకుంటాం. వారిని ఎవరూ క్షమించరు. ప్రధానమంత్రి ఇచ్చిన హామీల్ని అమలు చేయటం లేదు. ఏడాదికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్న హామీని గాలికి వదిలేశారు’’ అంటూ విరుచుకుపడ్డారు.

ఓవైపు బీజేపీని.. మోడీ సర్కారు మీద నిప్పులు చెరిగిన సీఎం రేవంత్.. తెలంగాణలోని తమ ప్రభుత్వం సాధించిన విజయాల్ని ఏకరువు పెట్టారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి పది నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ అమలు చేసి చూపించామన్నారు. కులగణను చేస్తామన్న హామీని పూర్తి చేశామని చెప్పారు. దేశ వ్యాప్తంగా జనగణన.. కుల గణన చేయాలన్న డిమాండ్ పై మాట్లాడేందుకు తమ నాయకుడు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తే.. లోక్ సభలో ఆయనకు మైకు ఇవ్వలేదన్నారు.

ప్రధాని మోడీ గ్యారెంటీ అంటే.. దేశాన్ని విభజించటమేనన్న సీఎం రేవంత్.. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ ఎన్నో ఆందోళనలు చేసినా.. ఆయనపై ఏనాడు లాఠీ ఎత్తలేదు. కానీ.. స్వాతంత్ర్యం వచ్చిన ఆర్నెల్లలోనే గాడ్సేలు తూటాలు పేల్చి ఆయన్ను పొట్టన పెట్టుకున్నారన్నారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు.. మోడీ ఆలోచన విధానాన్ని అడ్డుకోవటానికే ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లుగా పేర్కొన్నారు. గాడ్సే భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ప్రధాని మోడీని.. బీజేపీని అడ్డుకొని దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న రేవంత్ మాటలు అందరిని ఆకర్షిస్తున్నాయి.

Tags:    

Similar News