పన్నులు కట్టి సెకండ్ క్లాస్ సిటిజన్లుగా బతకాలా? రేవంత్ రెడ్డి మైండ్ బ్లోయింగ్ కామెంట్స్
దక్షిణాదిపై కేంద్రం ఆధిపత్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలను కేవలం పన్నులు కట్టే వనరులుగానే చూస్తున్నారని మండిపడ్డారు.
దక్షిణాదిపై కేంద్రం ఆధిపత్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలను కేవలం పన్నులు కట్టే వనరులుగానే చూస్తున్నారని మండిపడ్డారు. పన్నులు కడుతున్న దక్షిణాది రాష్ట్రాలు ఢిల్లీకి సెల్యూట్ చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ముఖ్యమైన పదవులు అన్నీ ఉత్తరాది వారి ఆధీనంలోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి వంటి కీలక పదవులు అన్నీ ఉత్తరాదివే అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బెంగళూరులో ది హిందూ పత్రిక నిర్వహించిన సదస్సులో ఆయన కేంద్ర ప్రభుత్వంపై, ఉత్తరాది ఆధిపత్యంపై నిప్పులు చెరిగారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొంటున్న వివక్షను లెక్కలతో సహా ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ద్వితీయ శ్రేణి పౌరులం కాదు
కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, రక్షణమంత్రి వంటి అత్యున్నత పదవులన్నీ కేవలం ఉత్తరాది నేతలకే దక్కుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి అత్యధికంగా పన్నులు చెల్లిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. "మేము పన్నులు చెల్లిస్తూ, ఢిల్లీకి సెల్యూట్ చేస్తూ.. దేశంలో రెండో శ్రేణి పౌరులుగా బతకడానికి సిద్ధంగా లేము" అంటూ దక్షిణాది ప్రజల ఆత్మగౌరవ వాదాన్ని బలంగా వినిపించారు.
గుజరాత్ మోడల్ పై విమర్శలు
దేశంలో పెట్టుబడుల ఆకర్షణ, గుజరాత్ మోడల్‌ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి పదునైన విమర్శలు గుప్పించారు. గుజరాత్ రాష్ట్రం తన స్వయం ప్రతిభతో పెట్టుబడులను ఆకర్షించడం లేదని, పారిశ్రామికవేత్తలను బలవంతంగా అక్కడ పెట్టుబడులు పెట్టేలా ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. గత రెండు దశాబ్దాలుగా కేవలం ఒకే ఒక్క 'అంబాసిడర్' గుజరాత్ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ పరోక్షంగా కేంద్ర పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిట్లర్ స్ఫూర్తితో 'హైడ్రా'
తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారిన 'హైడ్రా' ఏర్పాటు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని, ఆ పేరు వెనుక ఉన్న రహస్యాన్ని సీఎం ఈ వేదికపై పంచుకున్నారు. సమాజంలో ధనికులు, బలవంతులు ఇష్టారాజ్యంగా జలవనరులను, చెరువులను కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. హిట్లర్‌కు ఇష్టమైన ఒక పదం నుండి స్ఫూర్తి పొంది ఈ విభాగానికి పేరు పెట్టానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విభాగంలో ఏకంగా 3,000 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించామని, ఇకపై చెరువులను ఆక్రమించడానికి ఎవరూ సాహసించలేరని హెచ్చరించారు. యువతను పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశంలోనే అత్యుత్తమమైన 'ఈగిల్ ఫోర్స్' ను రంగంలోకి దించామన్నారు.
చైనా, జపాన్‌లతో పోటీ
తన నాయకత్వంలోని తెలంగాణ పక్కనే ఉన్న మహారాష్ట్ర లేదా ఇతర భారతీయ రాష్ట్రాలతో పోటీ పడటం లేదని.. తమ పోటీ కేవలం చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి విదేశాలతోనేనని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణను అంతర్జాతీయ వేదికపై 'చైనా + 1' ప్రత్యామ్నాయంగా మార్చడమే తన ప్రధాన అజెండా అని ప్రకటించారు. రాబోయే రోజుల్లో గ్లోబల్ మార్కెట్‌లో చైనా స్థానాన్ని భర్తీ చేసేలా తెలంగాణను పారిశ్రామికంగా, ఆర్థికంగా అగ్రపథాన నిలపడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.