జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ కేసు నమోదు.. ఎందుకంటే?
మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత మేనమామ, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.;
మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత మేనమామ, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం శ్రీవారి దర్శనానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు చేయగా, తిరుమల పోలీసులు సోమవారం కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తిరుమల శిఖరంపై ఎవరు కూడా రాజకీయ సంబంధ ప్రకటనలు చేయకూడదని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రాజకీయ ప్రకటనపై నిషేధం విధించింది. ఈ నిబంధనలు అతిక్రమించారని రవీంద్రనాథ్ రెడ్డిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా కొండపై రాజకీయాలు మాట్లారంటూ రవీంద్రనాథ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన తీరుపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రాష్ట్రంలో సరిగా పంటలు పండటం లేదని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో దొంగ హామీలు ఇచ్చారని, ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, 2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచి జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్థించినట్లు రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ‘‘గత ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో తెలియదు. వాళ్లే నామినేట్ చేసుకుని ఉంటే సరిపోయేది. అలా కాకుండా ప్రజలను, వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టి ఎన్నికలు జరిపారు. ఓట్లు వేసేందుకు ప్రజలను రానివ్వకుండా చేశారు’’ అంటూ మండిపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని తగ్గించేలా బూత్ లను దూరంగా ఏర్పాటుచేశారని ఆరోపంచారు.
ఈ విధంగా తిరుమల కొండపై పూర్తిగా రాజకీయాలే మాట్లాడతంతో మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనిపై స్పందించిన టీటీడీ పెద్దలు విజిలెన్స్ అధికారుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించారు.