ఏపీ రాజకీయాల్లో అనూహ్య మలుపు? జగన్ కు బీజేపీ పెద్దల నుంచి ఫోన్!

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చిందా? రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ కు బీజేపీ పెద్దల నుంచి ఫోన్ ఎందుకు వచ్చింది? పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.;

Update: 2025-08-18 09:37 GMT

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చిందా? రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ కు బీజేపీ పెద్దల నుంచి ఫోన్ ఎందుకు వచ్చింది? పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైసీపీ అధినేత జగన్ కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారని విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా బీజేపీకి మద్దతు ఇవ్వాలని రాజ్ నాథ్ సింగ్ మాజీ సీఎంను కోరినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్ల నుండగా, ఆయన ప్రయాణ సన్నాహాల్లో ఉన్న సమయంలో జగన్ కు కేంద్ర బీజేపీ పెద్దల నుంచి ఫోన్ రావడం ఆసక్తికర చర్చకు తెరలేపింది.

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధకృష్ణణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. సెప్టెంబరు 9న జరిగే ఎన్నిక జరగనుండగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సీపీ రాధకృష్ణణ్ పేరును ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధకృష్ణణ్ పేరు ఆమోదించడం లాంఛనంగానే చెబుతున్నారు. మంగళవారం ఎన్డీఏ పక్షాల నేతలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సీపీ రాధకృష్ణణ్ ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయనున్నారు. ఉప రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు సంపూర్ణ ఆధిక్యం ఉంది. సీపీ రాధకృష్ణణ్ సెప్టెంబరు 9న జరిగే ఎన్నికల్లో గెలవడం లాంఛనమే అని చెబుతున్నారు. కానీ, ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రధాని మోదీ ప్రతిపక్షాలతో మాట్లాడాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగుకు బాధ్యతలు అప్పగించారు.

కేంద్రంలో ఎన్డీఏతోపాటు ఇండి కూటమి మధ్య నువ్వా-నేనా అన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నెలకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది. ఇండి కూటమి పోటీ చేసినా, ఎన్డీఏ బలపరిచిన సీపీ రాధకృష్ణణ్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ, ఎన్నిక ఏకగ్రీవం చేసి ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిష్ఠ తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. దీంతో ప్రతిపక్షాలతోపాటు కేంద్రంలో తటస్థంగా ఉన్న పార్టీలతోనూ సంప్రదింపులు మొదలుపెట్టింది. ముందుగా తటస్థంగా ఉన్నవారి మద్దతు కూడగట్టాలనే ఆలోచనతో వైసీపీ అధినేత జగన్ తో కేంద్ర మంత్రి రాజనాథ్ సింగు మాట్లాడారని చెబుతున్నారు.

ప్రస్తుతం వైసీపీకి నలుగురు ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ సభ్యుల బలం ఉంది. వైసీపీ ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ, ఇండి కూటములకు సమదూరం పాటిస్తోంది. అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించేలా పలు నిర్ణయాలు తీసుకునేది. కానీ, ఎప్పుడూ ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపలేదు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో టీడీపీతో జట్టుకట్టి వైసీపీని ఓడించింది. ఈ పరిస్థితుల్లో జగన్ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర సర్కారులోని బీజేపీ అండదండలతోనే టీడీపీ కూటమి గెలువగలిగిందని అనుమానిస్తున్న మాజీ సీఎం జగన్.. బీజేపీపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఇండి కూటమితో కూడా జగన్ కు సఖ్యత కుదరలేదు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో హాట్ లైన్ చర్చల్లో ఉన్నారని విమర్శించిన జగన్ పరోక్షంగా తన వైఖరిని వెల్లడించారని అంటున్నారు.

దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలపై జగన్ తీసుకునే నిర్ణయం భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపనుందని అంటున్నారు. మరోవైపు ప్రస్తుతం వైసీపీ నేతలు పలు కేసుల్లో చిక్కుకున్న నేపథ్యంలో పార్టీతోపాటు పార్టీ నేతల భవిష్యత్తును జగన్ నిర్ణయం ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. దీంతో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యథావిధిగా బీజేపీకి అనుకూల నిర్ణయం తీసుకుంటారా? లేక ఇండి కూటమికి మద్దతు పలికి బీజేపీపై తమ నిరసనను వెల్లడిస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తో జగన్ ఏ విషయం మాట్లాడింది ఇప్పటివరకు బయటకు తెలియరాలేదు. ఈ విషయంపై వైసీపీ అధికారికంగా స్పందించే వరకు సస్పెన్స్ కొనసాగనుంది. అయితే బీజేపీ ప్రతిపాదనపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్ జవాబిచ్చినట్లు వైసీపీ అనుకూల మీడియా వెల్లడించింది.

Tags:    

Similar News