కోడళ్లకు కెమెరాలు ఉన్న ఫొన్లు నిషేధం.. జనవరి 26 నుంచి అమలు!
కెమెరాలు ఉన్న ఫోన్లు వాడోద్దు.. కీప్యాడ్ ఫోన్ లను మాత్రమే ఉపయోగించాలి.. వాటిని పక్కింటికి కానీ, వివాహాలకు, సామాజిక కార్యక్రమాలకు కానీ తీసుకెళ్లకూడదు.. ఇది తాజాగా ఓ గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం;
కెమెరాలు ఉన్న ఫోన్లు వాడోద్దు.. కీప్యాడ్ ఫోన్ లను మాత్రమే ఉపయోగించాలి.. వాటిని పక్కింటికి కానీ, వివాహాలకు, సామాజిక కార్యక్రమాలకు కానీ తీసుకెళ్లకూడదు.. ఇది తాజాగా ఓ గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం. ఇది ఆ ఊరి కోడళ్లతో పాటు యువతులకు వర్తిస్తుందని తీర్మానం వెల్లడించింది. దీంతో ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మనం ఏ రోజుల్లో ఉన్నామనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అవును... రాజస్థాన్ లోని జలర్ జిల్లాలో గల ఓ గ్రామ పంచాయతీ 15 గ్రామాలకు చెందిన కోడళ్లు, యువతులు కెమెరాలు ఉన్న ఫోన్ లను ఉపయోగించడాన్ని నిషేధించింది. ఇదే సమయంలో.. ప్రజా కార్యక్రమాలకు, పొరుగు ఇంటికి ఫోన్ ను తీసుకెళ్లడం పైనా నిషేధం విధించింది. వారంతా స్మార్ట్ ఫోన్ లకు బదులుగా కీప్యాడ్ ఫోన్ లను మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది. ఈ రూల్స్ జనవరి 26 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది.
జలోర్ జిల్లాలోని గాజీపూర్ గ్రామంలో ఆదివారం.. 14 ఉప విభాగాల అధ్యక్షుడు సుజ్ఞారాం చౌదరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే చదువుల కోసం మొబైల్ ఫొన్లు అవసరమైన పాఠశాలకు వెళ్లే బాలికలు మాత్రం.. వాటిని ఉపయోగించొచ్చు కానీ.. కేవలం ఇంట్లోనే వాటిని ఉపయోగించాలి. స్కూల్స్, బయట కార్యక్రమాలకు, పక్కింటికి వెళ్లినప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ ని తీసుకెళ్లకూడదు.
ఈ సందర్భంగా స్పందించిన చౌదరి... తమ ఇళ్లల్లోని మహిళల మొబైల్ ఫొన్ లను చౌదరి తరచుగా ఉపయోగిస్తున్నారని.. ఇది వారి కంటి చుపును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని.. అందువల్లే ఈ కీలక నిర్ణయం తిసుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో.. కొంతమంది మహిళలు తమ రోజువారీ పనులపై దృష్టి పెట్టడానికి వీలుగా పిల్లలకు ఫోన్ లు ఇచ్చి, వారిని పరధ్యానంలో ఉంచుతున్నారని అన్నారు.
ఈ ఆదేశాలు రిపబ్లిక్ డే రోజైన జనవరి 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో భాగంగా... గాజీపురా, కల్రా, పావ్లీ, మనోజియ వాస్, దత్లావాస్, రజికాస్, రాజ్ పురా, సిద్రోడి, కోడి, ఖానాదేవల్, సవిధర్, భీన్మాల్ లోని హత్మీ ధాని, ఖాన్ పూర్ గ్రామాలలో ఈ నిబంధనలు వర్తిస్తాయి. దీంతో... ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.