బీజేపీలో కలి పుట్టిస్తున్న ఆ ఇద్దరూ !

ఇక బీజేపీ నుంచి మూడు సార్లు గెలిచి గోషామహల్ కి కింగ్ అనిపించుకునే రాజా సింగ్ తెలంగాణా పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించి ఆ మధ్య సస్పెండ్ అయ్యారు.;

Update: 2025-12-07 03:45 GMT

దేశంలో ఏ పార్టీలోనైనా ఫిరాయింపులు ఉండొచ్చు కానీ బీజేపీలో ఉండవని అంటారు. ఆ పార్టీని తేడా గల పార్టీ అని గొప్పగా చెప్పుకుంటారు. అంతే కాదు సిద్ధాంతాల మీద ఉన్న పార్టీగా పేర్కొంటారు. ఆ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా పార్టీకి కట్టుబడి పని చేస్తారు. అయితే ఇటీవల బీజేపీలో ఇతర పార్టీల నుంచి నేతలు చేరుతున్నారు. వారు తమ పాత వాసనలు మార్చుకోలేకపోతున్నారు. దాంతో బీజేపీలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతే కాదు పార్టీలో మొదటి నుంచి ఉన్న వారు కూడా కాలానుగుణంగా కొంత మారుతున్నారు అని అంటున్నారు. తెలంగాణాలో చూస్తే బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అందులో ఒక ఎమ్మెల్యే ఇప్పటికే పార్టీని ధిక్కరించి సస్పెండ్ అయ్యారు. ఇపుడు మరో ఎమ్మెల్యే కూడా కట్టు తప్పుతున్నారు అని కమలం పెద్దలు కలవరపడుతున్నారు.

రాజా సింగ్ అంటే :

ఇక బీజేపీ నుంచి మూడు సార్లు గెలిచి గోషామహల్ కి కింగ్ అనిపించుకునే రాజా సింగ్ తెలంగాణా పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించి ఆ మధ్య సస్పెండ్ అయ్యారు. అయితే పార్టీ ఆయనను సస్పెండ్ అయితే చేసింది కానీ స్పీకర్ కి దాని మీద ఫిర్యాదు చేయలేదు, దాంతో ఆయన ఎమ్మెల్యే గిరీ అలాగే ఉంది. దాంతో ఆయన మరింతగా దూకుడు చేస్తూ బీజేపీ నేతల మీద విమర్శలు చేస్తూ చికాకు పెడుతూనే ఉన్నారు. తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ ఆయన పార్టీకి యాంటీగా బిగ్ సౌండ్ చేసి ఇరకాటంలో పెట్టేశారు. అయినా కమలం పార్టీ ఎందుకో ఆయన మీద యాక్షన్ కి దిగడం లేదు అన్న చర్చ ఉంది.

ఏకంగా సీఎం ని పొగుడుతూ :

ఇక రాజాసింగ్ తలనొప్పి ఒకటి ఉండగా మరో ఎమ్మెల్యే కూడా ఆయనకు తోడుగా తయారు అయ్యారని అంటున్నారు. ఆయనే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అని అంటున్నారు. ఆయన మరో అడుగు ముందుకేసి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని తెగ పొగుడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తే సీఎం తో పాటే ఆయన మొత్తం అసాంతం ఉన్నారు. ఆయననే అట్టిపెట్టుకొని ఉన్నారు.అంతే కాదు సభలో అయితే ఏ కాంగ్రెస్ నేతకూ తీసిపోకుండా రేవంత్ రెడ్డిని తెగ పొగిడేశారు. దాంతో ఇపుడు కమలం పార్టీలో పాయల్ శంకర్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది అని అంటున్నారు.

హైకమాండ్ కే మరి :

బీజేపీ ఎమ్మెల్యే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిని సభలో బహిరంగంగా పొగిడిన తీరు మీద వీడియో క్లిప్పింగ్స్ తో పాటు పేపర్ కటింగ్స్ కూడా జత చేసి మరీ బీజేపీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నేతలు కొనరు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణా నుంచి దేశ రాజకీయాల్లఒ సైతం బీజేపీ కాంగ్రెస్ అంటే భీకరమైన పోరుతో ఉంటాయి. అలాంటిది బీజేపీకి చెందిన ఎమ్మెల్యేనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగిడితే అది జనంలో తప్పుడు సంకేతాలు ఇస్తుందని కమలం పార్టీలో చర్చ సాగుతోంది. కేంద్ర పెద్దలు ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని రాష్ట్ర నాయకులు కోరుతున్నారని అంటున్నారు.

ధీమా అందుకేనా :

అయితే ఉన్న ఎనిమిది మందిలో ఇద్దరు ఈ విధంగా వ్యవహరిస్తూంటే పార్టీ పెద్దలు మాత్రం ఏమి చేస్తారు అని అంటున్నారు. అయితే రాజా సింగ్ విషయంలోనే సీరియస్ గా వ్యవహరించి ఉంటే పాయల్ శంకర్ దాకా వ్యవహారం వచ్చేది కాదని అంటున్నారు. రాజా సింగ్ ఎంతలా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నా ఆయన ఎమ్మెల్యే గిరిని అలాగే ఉంచారని అదే మిగిలిన వారిలో ధీమాను పెంచుతోంది అని అంటున్నారు. దాంతో ఈ ఇద్దరి విషయంలో హైకమాండ్ కచ్చితమైన నిర్ణయం తీసుకుంటేనే మిగిలిన వారు ఎంత పెద్ద నేతలు అయినా పార్టీ లైన్ లో ఉండేందుకు ఆస్కారం ఉంటుంది అని అంటున్నారు. మరి బీజేపీ పెద్దలు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News