తెలంగాణకు జనసేన ముఖ్యమంత్రి! ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం
తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్రపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్రపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా జనసేన ఎదిగే అవకాశాలు ఉన్నాయని, వచ్చే మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సూచించారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన భవిష్యత్తుపై రాజాసింగ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2014 నుంచి తెలంగాణ రాజకీయాల్లో శూన్యత నెలకొందని, జనసేన ఆ శూన్యతను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఉండదంటూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రామచంద్రరావు ఇటీవల ప్రకటన చేసిన నేపథ్యంలో తాజాగా రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆదరణ ఉందని, జనసేన పార్టీకి మద్దతు పెరుగుతోందని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత కీలక పరిణామానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజాసింగ్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టంగా తెలియకపోయినా, తెలంగాణ రాజకీయాల్లో జనసేనను ఓ వర్గం కోరుకుంటుంది అనే సంకేతాలు అందుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణలో జనసేన బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి పెట్టేలా జనసేనాని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించాలని రాజాసింగ్ కోరారు. ఇదే సమయంలో ఆయన తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్షంలోని బీఆర్ఎస్, బీజేపీపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని రాజాసింగ్ ఆరోపించారు. అదే సమయంలో బీజేపీలో పరిస్థితులు ఏమంత బాగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో జనసేన గట్టిగా పనిచేస్తే తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సంచలన విశ్లేషణ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చూసిన జనాలు విసిగిపోయారని, బీజేపీ అంతర్గత రాజకీయాలు వల్ల అధికారంలోకి వచ్చే అవకాశం లేదని రాజాసింగ్ విశ్లేషించారు. ప్రస్తుతం ఈ అంశంపైనే ఎక్కువ చర్చ జరుగుతోందని, తన అంచనాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో జనసేన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై పోటీ చేసిన రాజాసింగ్ గత ఏడాది ఆ పార్టీకి రాజీనామా చేశారు. హిందుత్వవాదిగా ముద్రపడిన ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలతో జనసేనాని పవన్ కు దగ్గరయ్యే సంకేతాలిస్తున్నారని పరిశీలకులు అనుమానిస్తున్నారు.