అమిత్ షా వర్సెస్ రాహుల్...
గెలిచినపుడేమో ఈవీఎంలు గొప్ప అని అంటారు, ఓడిపోతే మాత్రం విమర్శిస్తారు, ప్రజా స్వామ్యంలో డబుల్ స్టాండర్స్ తగునా అని ప్రశ్నించారు.;
లోక్ సభలో బుధవారం ఒక హీటెడ్ డిస్కషన్ అయితే చోటు చేసుకుంది. సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ సభలో ఉన్న కేంద్ర హోం మంత్రిని నిలదీశారు ఎన్నికల సంస్కరణల మీద రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముందు తాను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో అమిత్ షా సైతం ఆగ్రహంతో రాహుల్ గాంధీకి జవాబు చెప్పారు. మీరు సభను శాసించలేరు అంటూ మీ ఆదేశాలతోనే పార్లమెంట్ నడుస్తుంది అని భావిస్తున్నారా అని ప్రశ్నించారు.
మూడు దశాబ్దాలుగా :
తాను గత మూడు దశాబ్దాలుగా చట్ట సభలో ఉన్నానని అమిత్ షా పేర్కొన్నారు. అసెంబ్లీ పార్లమెంట్ కలిపి తన అనుభవం చాలా ఎక్కువ అని అమిత్ షా చెప్పారు. ఎపుడు ఎక్కడ ఏ సమయంలో మాట్లాడాలో తనకు తెలుసు అని తాను ఏది మాట్లాడాలో కూడా రాహుల్ ఆదేశించాలనుకోవడమేంటని ఫైర్ అయ్యారు. మీకు ఇష్టం వచ్చినపుడు చర్చ సాగదు అని కూడా అమిత్ షా ఘాటైన రిప్లై ఇచ్చారు.
డబుల్ స్టాండర్డ్ అంటూ :
గెలిచినపుడేమో ఈవీఎంలు గొప్ప అని అంటారు, ఓడిపోతే మాత్రం విమర్శిస్తారు, ప్రజా స్వామ్యంలో డబుల్ స్టాండర్స్ తగునా అని ప్రశ్నించారు. ఇక వెనక్కి వెళ్తే గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్ లలో బీజేపీ ఓటమి పాలు అయిందని అంతమాత్రం చేత తాము ఈవీఎంలను నిందించలేదని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఒక వైపు ఎన్నికల సంస్కరణలు కావాలని అంటారు, ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయాలని కోరుతారు, తీరా సర్ పేరుతో అమలు చేస్తూంటే వద్దు అని యాగీ చేస్తారు అని అమిత్ షా రాహుల్ గాంధీ మీద ఫైర్ అయ్యారు.
అన్నీ అబద్ధాలే అంటూ :
గత నాలుగు నెలలుగా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతూ వస్తోంది అని అమిత్ షా మండిపడ్డారు. ఓట్ల దొంగతనం అని అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. అయితే ఓటర్ల జాబితా నుంచి మరణించిన వారిని ఎలా తొలగిస్తారో అలాగే విదేశీయులను కూడా తొలగిస్తారు అని అదంతా రాజ్యాంగం ప్రకారం సాగే ఒక ప్రక్రియ అన్నారు. ఓటర్ల జాబితా ప్రక్రియను ప్రక్షాళన చేసే విషయం అన్నది పాతదన్ నెహ్రూ టైం నుంచి కొనసాగుతూ వస్తోంది అని అన్నారు. మన్మోహన్ సింగ్ దాకా ఎవరూ దానిని వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం సర్ వద్దు అంటోంది అని అమిత్ షా ఫైర్ అయ్యారు. చట్ట విరుద్ధమైన అక్రమ వలసదారుల ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ భావిస్తోందా అని అమిత్ షా ప్రశ్నించారు.
నకిలీ ఓట్లు అన్న రాహుల్ :
అయితే రాహుల్ గాంధీ మాత్రం నకిలీ ఓట్లు ఉన్నాయని ద్వజమెత్తారు. అర్హులైన వారి ఓట్లను ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు అని ఆయన వాదిస్తున్నారు. దీని మీదనే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పార్లమెంట్ వేదికగా మాటల యుద్ధమే సాగింది. అయితే అమిత్ షా ఆగ్రహం తరువాత తమ ప్రశ్నలకు ప్రభుత్వం సరైన తీరులో జవాబు చెప్పడం లేదని ఆగ్రహిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు అన్నీ సభ నుంచి వాకౌట్ చేయడం విశేషం.