తీరు మారని రాహుల్.. కాంగ్రెస్‌కు తిప్పలే!
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్‌సభలో విపక్షనేత.. రాహుల్‌గాంధీ మరోసారి బీజేపీకి అడ్డంగా దొరికేశారు.;
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్‌సభలో విపక్షనేత.. రాహుల్‌గాంధీ మరోసారి బీజేపీకి అడ్డంగా దొరికేశారు. అసలే.. బీజేపీ నాయకులుఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు రాహుల్‌ను ఏకేస్తున్నారు. పైగా ఇప్పుడు మూడురాష్ట్రాల ఎన్నికలకురంగం రెడీ అవుతున్న దరిమిలా.. మరింతగా రాహుల్‌ను కార్నర్ చేయాలని బీజేపీ నాయకులు రెడీఅయ్యారు. ఇలాంటి సమయంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించి.. తనను కాపాడుకుని.. పార్టీని కూడా కాపాడాల్సి ఉంది.
కానీ.. ఈ విషయంలో రాహుల్ దారులు తప్పుతున్నారు.. తప్పటడుగులే వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్‌గాంధీ.. మరోసారి అక్కడ భారత్‌పై విమర్శలుగుప్పించారు.ఇప్పటికే ఆయన బ్రిటన్‌పర్యటనలో చేసిన విమర్శలను ప్రధాని మోడీ ఇటీవల కూడా ఎండగట్టారు. అలాంటిది తన తీరు ను మార్చుకునేందుకు రాహుల్ ఎంత మాత్రమూ ప్రయత్నించడం లేదు. తాజాగా అమెరికాలో రాహుల్ గాంధీ మట్లాడుతూ.. భారత దేశ ఎన్నికల వ్యవస్థను తప్పుబట్టారు.
వాస్తవానికి ప్రపంచ దేశాలన్నీ.. భారత ఎన్నికల వ్యవస్థను మెచ్చుకుంటున్నాయి. ఒక్క ఎలాన్ మస్క్ తప్ప.. ట్రంప్ కూడా.. భారత ఎన్నికల వ్యవస్థపై ఎప్పుడూ విమర్శలు చేయలేదు. అలాంటి చోట రాహు ల్.. ``భారత ఎన్నికల సంఘం కొన్ని పార్టీలతో రాజీ పడుతోంది`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. భారత ఎన్నికల వ్యవస్థపై.. సంఘంపై.. అక్కడి ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని చెప్పుకొచ్చారు. కానీ.. వాస్తవానికి ప్రజలకు నమ్మకం ఉంది... లేనిదల్లా కాంగ్రెస్ కేనని బీజేపీ నాయకులు విమర్శించిన విషయం తెలిసిందే.
అక్కడితోకూడా.. ఆగని రాహుల్.. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలను ప్రస్తావించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5.30-7.30 మధ్య 70 లక్షల మంది ఓట్లు వేసిన ట్టు ఎన్నికల సంఘం చెప్పిందని.. కానీ, ఇది ఎలా సాధ్యమో .. సంఘానికైనా తెలియదని అందుకే తమకు సమాధానం చెప్పడం లేదని.. ఇదంతా రాజీ పడడం వల్లే జరుగుతోందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ``సాధారణంగా ఓటరు ఓటు వేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. కానీ.. కేవలం రెండు గంటల్లో 70 లక్షల మంది ఎలా ఓటేశారు? దీనికి సమాధానం లేదు. సో.. ఇదీ.. భారత ఎన్నికల వ్యవస్థ`` అని చెప్పుకొచ్చారు. సహజంగా విదేశాలకు వెళ్లినప్పుడు.. భారత దేశ గొప్పతనాన్ని చెబుతుంటారు. కానీ,రాహుల్ తరచుగా ఇలానే విమర్శలు చేస్తూ.. అడ్డంగా దొరికి పోతున్నారు.