రిజర్వేషన్ల మీద బిగ్ డిబేట్ పెట్టిన రాహుల్

కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ రిజర్వేషన్ల తేనే తుట్టెను కదిపారు.;

Update: 2025-04-09 16:30 GMT

కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ రిజర్వేషన్ల తేనే తుట్టెను కదిపారు. దాంతో సమీప భవిష్యత్తులో ఇది అతి పెద్ద చర్చగా ముందుకు రానుంది ఈ దేశానికి స్వాతంత్ర్యం లభించి ఎనిమిది దశాబ్దాలు పూర్తి అవుతోంది. ఇంకా రిజర్వేషన్ల మీద హాట్ హాట్ గా చర్చ సాగుతూనే ఉంది. రిజర్వేషన్ల మీద భిన్న వాదనలు ఉండడం విశేషం.

ఈ దేశంలో బ్రిటిష్ వారి ఏలుబడిలోనే రిజర్వేషన్ల సదుపాయం వచ్చింది. అపుడు వారు సమాజంలో కొన్ని వర్గాలకు ఉన్నతి కల్పించాలని భావించి కేటగిరీలుగా చేసి రిజర్వేషన్లు ఇచ్చేవారు. అయితే అది పరిమిత స్థాయిలో ఉండేది. కానీ స్వాతంత్ర్యం వచ్చాక ఆ పరిస్థితి మారింది. రాజ్యాంగ నిర్మాతలు పదేళ్ళ పాటు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయిస్తే దానికి ఆ తరువాత వచ్చిన పాలకులు రాజకీయ ఉద్దేశ్యాలతో పెంచుకుని పోయారన్న విమర్శలు ఉన్నాయి.

ఇక రిజర్వేషన్ల అమలు అయిన ఈ ఎనభై ఏళ్ళ కాలంలో ఎంత వరకూ సమాజం మెరుగు అయింది. ఏ విధంగా మార్పు వచ్చింది అన్నది సమీక్ష కూడా సమగ్ర స్థాయిలో జరగాలి అన్న డిమాండ్ కూడా ఉంది. మరో వైపు రిజర్వేషన్లు ఉండాలి కానీ అవి పేరికం ప్రాతిపదికన మాత్రమే ఉండాలని కోరే వారు ఉన్నారు

అంటే ఆర్ధికపరమైన రిజర్వేషన్లు కల్పిస్తే కులాలతో సంబంధం లేకుండా పేదలు అందరికీ మేలు జరుగుతుందని కూడా మేధావులు సూచిస్తున్నారు. ఇలా రకరకాలుగా వాదనలు ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్ల మీద రాహుల్ గాంధీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

తాము అధికారంలోకి వస్తే రిజవేషన్ల మీద 50 శాతం పరిమితిని తొలగిస్తామని ఆయన చెప్పారు. దళితులు ఆదీవాసీల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది అని ఆయన అంటూ దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలా చేస్తే కనుక ఓబీసీల సంఖ్య ఎంతో తేలుతుందని అన్నారు. కుల గణన మీద పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు.

ఈ విధంగా ఆయన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏఐసీసీ సమావేశాలలో ప్రకటించారు. అయితే రిజర్వేషన్లు యాభై శాతం మించరాదు అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఇక రిజర్వేషన్ల పరిమితి పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు అంతే కాదు రిజర్వేషన్ల పరిమితిని పెంచితే అపుడు ఆ పరిధిలోకి రాని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతాయన్న మాట కూడా ఉంది.

మరో వైపు చూస్తే రిజర్వేషన్లు పెద్ద ఎత్తున కల్పించినా ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు అవకాశాలు అంతకంతకు తగ్గిపోతున్న నేపథ్యం ఉంది అని గుర్తు చేస్తున్నారు. ప్రైవేట్ రంగం విస్తరిస్తోంది. మిశ్రమ ఆర్ధిక వ్యవస్థగా భారత దేశం ఉన్నా ప్రైవేట్ సామ్రాజ్యమే పెరుగుతోంది. దాంతో ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు ఏ మేరకు ఉపయోగపడతాయన్నది చూడాల్సి ఉంది.

ఇక కొన్ని సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పనిచేస్తోందన్న భావన కలిగితే అది ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఈ విషయంలో ఆ పార్టీ కూడా మరింతగా మేధో మధనం చేయాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా రిజర్వేషన్లు అన్నవి ఒక తేనే తుట్టె లాంటివే. వాటిని కదిపితే ఇబ్బందే అన్న భావన కూడా ఉంది.

Tags:    

Similar News