ఆ సంతకాలకు జగన్‌కు సంబంధమే లేదు.. అదంతా అబద్ధం: బాంబ్ పేల్చిన రఘువీరా రెడ్డి

ముఖ్యమంత్రి కావాలని జగన్ భావించి ఉండొచ్చు కానీ, సంతకాలు చేయాలని ఆయన చెప్పలేదన్నారు. జగన్ ను కాంగ్రెస్ లో కొనసాగాలని తాను సూచించానని కూడా చెప్పారు.

Update: 2026-06-11 07:23 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం సీఎం సీటు కోసం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డి సంతకాలు సేకరించారనే ఆరోపణలు అన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి వెల్లడించారు. వైఎస్ మరణించిన దాదాపు 16 ఏళ్ల తర్వాత అప్పట్లో ఏం జరిగింది అన్న విషయంపై రఘువీరారెడ్డి బయటపెట్టారు. తండ్రి శవం ఉండగానే సీఎం సీటు కోసం జగన్ సంతకాలు చేశారంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని, అందుకు తానే ప్రత్యక్షసాక్షి అంటూ రఘువీరారెడ్డి ఆసక్తికర అంశాలను తెలియజేశారు.

ఓ యూట్యబర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2009లో వైఎస్ మరణించిన సమయంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను రఘువీరారెడ్డి వివరించారు. వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి ఆయన మరణాంతరం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగారు. తమ నాయకుడిగా జగన్ ను భావించామని, ఆయన కాంగ్రెస్ లో ఉంటే ఎప్పటికైనా సీఎం అవుతారని తాను చెప్పానని రఘువీరా తెలిపారు. అంతేకాని తండ్రి మరణానంతరం జగన్ సీఎం అవ్వాలని కోరుకోలేదని రఘువీరా తెలిపారు.

వైఎస్ తర్వాత జగన్ సీఎం అవ్వాలని తామంతా కోరుకున్నామని నాటి మంత్రుల మనోగతాన్ని రఘువీరారెడ్డి బయటపెట్టారు. ఇదే విషయాన్ని తాను జగన్ తో చెప్పిన విషయాన్ని తెలిపారు. అయితే జగన్ ను సీఎం చేయాలని జరిగిన సంతకాల సేకరణలో తనది చివరి సంతకమని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను పావురాలగుట్టకు వెళ్లడంతో ఆ మరునాడు జగన్ ను సీఎం చేయాలని తాను సంతకం చేశానని తెలిపారు.

ముఖ్యమంత్రి కావాలని జగన్ భావించి ఉండొచ్చు కానీ, సంతకాలు చేయాలని ఆయన చెప్పలేదన్నారు. జగన్ ను కాంగ్రెస్ లో కొనసాగాలని తాను సూచించానని కూడా చెప్పారు. కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని చెబుతున్నారని జగన్ తనతో చెబితే ఆ పదవి తీసుకోవాలని కూడా తాను సూచించానని రఘువీరా వెల్లడించారు. వైఎస్ కాంగ్రెస్ లో 20 ఏళ్లు పనిచేసి ముఖ్యమంత్రి అయ్యారని, కాంగ్రెస్ లో కొనసాగితే ముఖ్యమంత్రి అయ్యేవరకు తమ భుజాలపై మోస్తామని జగన్ కు తాను చెప్పానని రఘువీరా వివరించారు.

దాదాపు 16 ఏళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్ సంతకాలు సేకరించలేదంటూ సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. రఘువీరా కామెంట్స్ తో ఇన్నాళ్లు ప్రత్యర్థుల నుంచి విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డికి ఇకపై వాటిని ఎదుర్కొనే నైతిక స్థైర్యం లభించిందని అంటున్నారు. 2009లో హెలికాఫ్టర్ ప్రమాదంలో రాజశేఖరరెడ్డి దుర్మరణం చెందగా, ఆయన తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం బలంగా కోరుకున్నట్లు రఘువీరారెడ్డి వ్యాఖ్యల బట్టి అర్థమవుతోందని అంటున్నారు.

Tags:    

Similar News