పెద్దిరెడ్డి బ్యాచ్ అరాచకాలకు పుల్ స్టాప్ పడదా?
అధికారం ఎవరి చేతిలో ఉన్నా.. తమ హవా మాత్రం తగ్గదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచర వర్గం.;
అధికారం ఎవరి చేతిలో ఉన్నా.. తమ హవా మాత్రం తగ్గదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచర వర్గం. తాజాగా వారు మరింతగా రెచ్చిపోయారు. అధికార తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఇళ్లపై దాడికి పాల్పడటం.. వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్న వైనం షాకింగ్ గా మారింది. గత నెలలో టీడీపీ సానుభూతిపరులపై దాడి జరపటం.. హత్య చేయటం లాంటి వరుస ఘటనలతో పుంగనూరు నియోజకవర్గం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
ఈ దారుణ హత్య విచారణ ఒక కొలిక్కి రాకముందే.. మరోసారి పెద్ద ఎత్తున దాడి జరగటం సంచలనంగా మారింది. మార్చిలో హత్యకు గురైన టీడీపీ సానుభూతిపరుడు రామక్రిష్ణకు చెందిన బంధువలపై తాజా దాడి జరిగింది. పెద్దిరెడ్డి అనుచరుడు నారాయణస్వామి వర్గం దాడికి తెగబడినట్లుగా బాధిత కన్యాకుమారి కుటుంబం ఆరోపించింది.
రాళ్లు.. వేటకొడవళ్లతో హరనాథ్.. వెంకటేశ్.. కన్యాకుమారిపైనా విచక్షణరహితంగా దాడి చేశారు. ఇంటి మీదకు తెగబడటం ఒక ఎత్తు అయితే.. వెంటాడి మరీ కుటుంబ సభ్యులపై దాడి చేయటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి.. చికిత్స జరుపుతున్నారు.
తనకు రాజకీయంగా ఎదురు నిలిచే ఎవరిని వదిలిపెట్టేలా లేదు పెద్దిరెడ్డి అనుచర వర్గం. మార్చి 15న పుంగనూరు మండలం క్రిష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామక్రిష్ణను పెద్దిరెడ్డి వర్గీయులు, వైసీపీ కార్యకర్త వెంకటరమణ వేటకొడవళ్లతో కిరాతకంగా నరికి చంపటం అప్పట్లో పెను సంచలనంగా మారింది. తాజాగా అదే కుటుంబానికి చెందిన బంధువులపైనా పెద్దిరెడ్డి అనుచరులు మరోసారి దాడికి పాల్పడటం కలకలాన్ని రేపుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినాయకుడు కం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.