పులివెందులలో పసుపు జెండా ఎలా సాధ్యమైంది?
పార్టీ.. నేతలు.. క్యాడర్ కష్టపడి పని చేస్తే సరిపోదు. ఎన్నికల వేళ.. ప్రత్యర్థి పార్టీకి మించిన కసి ఉండాలి. అది పార్టీ అధినేత మొదలు కార్యకర్త వరకు.;
ఎన్నికలు అన్నంతనే ఎవరి అంచనాలు వారివి. బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులే కాదు.. పోటీ చేసే వారిలో చాలామంది తామే విజయం సాధిస్తామని.. అందుకు అనువుగా ఉండే అంశాల్ని బలంగా ప్రస్తావిస్తుంటారు. తాజాగా ఏపీలో జరిగిన రెండు జెడ్పీ ఉప ఎన్నికల వేళలోనూ ఈ తరహాలోనే అంచనాలు సాగాయి. రెండు ప్రధానపార్టీలు ఈ రెండు ఉప ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికి.. అధికార పక్షానికి ఉండే అడ్వాంటేజ్ ఏమిటన్న విషయం ఈ ఎన్నికలు మరోసారి నిరూపించాయి.
పార్టీ.. నేతలు.. క్యాడర్ కష్టపడి పని చేస్తే సరిపోదు. ఎన్నికల వేళ.. ప్రత్యర్థి పార్టీకి మించిన కసి ఉండాలి. అది పార్టీ అధినేత మొదలు కార్యకర్త వరకు. దీనికి చక్కటి ఉదాహరణగా 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలుగా చెప్పాలి. వైఎస్ జగన్ ను ఓడించటమే లక్ష్యంగా టీడీపీ మొత్తం ఒకే తాటి మీద నడవటం ఒక ఎత్తు అయితే.. ప్రతి కార్యకర్త.. పార్టీ అభిమాని ఒక నేతలా మారి తన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయటమే కాదు.. గెలుపు తప్పించి మరే అంశాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. విజయానికి అవసరమైన ఏ పని అయినా చేసేందుకు వెనుకాడలేదు. ఇలాంటి తీరు ఎన్నికల్లో గెలుపునకు కీలకంగా మారుతుంది.
తాజాగా జరిగిన రెండు జెడ్పీ ఉప ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట లాంటి ఉమ్మడి కడప జిల్లాలో ఘోర పరాభవం ఎదురు కావటానికి కారణం.. అధికార పార్టీ అనూహ్యమైన రీతిలో రియాక్టు అయితే.. ప్రతిపక్ష వైసీపీ తన ఉనికిని.. బలాన్ని కాపాడుకోవటానికే మొగ్గు చూపింది. అంటే.. అధికార పార్టీ విజయం మనదే.. ఏం చేసైనా సరే.. పసుపు జెండాను విజయకేతనంగా మార్చాలన్నదే లక్ష్యంగా వ్యవహరిస్తే.. వైసీపీ మాత్రం గెలుపును నిలుపుకునే ప్రయత్నం చేసింది. ఇందుకోసం డబ్బుల పంపకాల మీద ఎక్కువగా ఆధారపడినట్లుగా చెబుతున్నారు.
అదే సమయంలో అధికార టీడీపీ విషయానికి వస్తే.. జగన్ పార్టీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఖర్చు చేయటం.. పంకాలు చేస్తూనే.. ఆ స్థానాల్లో కొన్నేళ్లుగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపని సెక్షన్లను ఓటు వేసేలా చేయటం కీలకంగా మారింది. ఉదాహరణకు పులివెందుల జెడ్పీ ఉప ఎన్నికనే తీసుకుంటే.. ఈ జెడ్పీటీసీ పరిధిలో మొత్తం 10,601 ఓట్లు ఉన్నాయి. అందులో రాగిమానుపల్లె.. అచ్చవెల్లి.. ఎర్రవెల్లి.. ఈ.కొత్తపల్లె.. కనంపల్లె పంచాయితీలు ఉన్నాయి. ఈ గ్రామాలు అన్నింట్లోనూ వైఎస్ ఫ్యామిలీకి గట్టి అభిమానులు ఉన్నారు. వారంతా కరుడుగట్టిన వైఎస్ అభిమానులు కం బలమైన మద్దతుదారులు.
వీరు వైఎస్ కుటుంబం మినహా మరెవరిని ఆదరించేందుకు సిద్దంగా ఉండరు. అందుకే.. వీరి దెబ్బకు ఇతర పార్టీల్ని అభిమానించే వారంతా ఓటు ముఖం చూడటం తర్వాత.. ఎన్నికల వేళ బయటకు వెళ్లేందుకు ఇష్టపడరు. తాజాగా జరిగిందేమంటే.. మారిన రాజకీయ వాతావరణ పరిస్థితులతో వైఎస్ అభిమానులు పోలింగ్ కు దూరం కాగా.. అదే సమయంలో కొన్నేళ్లుగా ఓటు వేయని టీడీపీ మద్దతుదారులు ఓటు వేయటం పులివెందుల జెడ్పీ స్థానాన్ని పసుపు దళం సొంతం చేసుకోవటంలో కీలకంగా మారిందని చెప్పాలి.
దీంతో పాటు టీడీపీ నేత బీటెక్ రవి అనుసరించిన వ్యూహం బాగా పని చేసింది. వైసీపీలో గుర్తింపు కోసం తహతహ లాడుతున్న వారిని టీడీపీలోకి తీసుకురావటం.. ఉప ఎన్నికల్లో సత్తా చాటితే వారి బలం పార్టీ అధినేతకు తెలుస్తుందని.. వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న హామీ కూడా బాగానే వర్కువుట్ అయ్యిందని చెబుతున్నారు. పోలింగ్ కు ముందే టీడీపీ గెలుపు ఖాయమైంది. కారణం.. కీలకమైన పోలింగ్ వేళ వైసీపీ నేతలు.. క్యాడర్ కనిపించకుండా పోవటమే. అధికారం చేతిలో లేని వేళ వచ్చిన ఎన్నికతో పాటు.. పార్టీ కీలక నేతలు పెద్దగా చొరవ తీసుకోకపోవటంతో.. క్యాడర్ సైతం సైలెంట్ అయ్యింది. వైఎస్ మీద అభిమానం ఉన్నప్పటికి.. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎలాంటి గుర్తింపు లభించలేదన్న గుర్రు కొందరిలో ఉంది. అది కూడా వైసీపీ ఓటమికి ఒక కారణంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇలా ఎన్నో అంశాలు పులివెందులలో వైసీపీ ఓటమికి కారణమైందని చెబుతున్నారు.