జ‌గ‌న్‌కు పులివెందుల 'డైల్యూట్' అవుతోందా.. ?

పులివెందుల .. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత కంచుకోట‌. వ‌రుస విజ‌యాలతో పాటు.. వైఎస్ కుటుంబానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం క‌లిసి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.;

Update: 2026-01-17 22:30 GMT

పులివెందుల .. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత కంచుకోట‌. వ‌రుస విజ‌యాలతో పాటు.. వైఎస్ కుటుంబానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం క‌లిసి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు టీడీపీ వ్యూహాత్మ‌క అడుగులు వేస్తుండ‌డంతో పులివెందుల నియో జ‌క‌వ‌ర్గం జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మారింది. త‌న అనుకున్న‌వారే.. త‌న‌ను వ‌దిలేసి వెళ్లిపోతున్నారు. గ‌త జెడ్పీ టీసీ ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ ప‌రాజ‌యం పాలైంది.

ఆ త‌ర్వాత మరింత మంది వైసీపీ నాయ‌కులు.. టీడీపీ బాట‌ప‌ట్టారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఇటీవల కాలంలో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. చాప‌కింద నీరు మాదిరిగా టీడీపీ ఇక్క‌డ విస్త‌రిస్తోంది. మ‌రోవైపు.. ఇతర పార్టీల ప్ర‌భావం పెద్ద‌గా లేక‌పోవ డంతో ఆల్ట‌ర్నేట్ పార్టీగా టీడీపీ ఉంది. దీంతో నియోజకవర్గంలోని వేంపల్లిలో వైసీపీ నేత, జగన్‌కు అత్యంత స‌న్నిహితుడు కూడా అయిన‌ చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ కండువా క‌ప్పుకోవ‌డంతో ఆయ‌న‌తో వంద‌లాది మంది సైకిల్ ఎక్కారు.

ఒక‌ప్పుడు జ‌గ‌న్ కోసం ప్రాణం ఇస్తామ‌ని చెప్పిన చంద్ర‌శేఖ‌ర్‌.. ఇప్పుడు టీడీపీలో చేరిపోయిన త‌ర్వాత‌.. ఇక‌, వైసీపీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. ఇదేస‌మ‌యంలో కొత్త‌గా వ‌చ్చే వారికి త‌మ పార్టీ త‌లుపులు తీసే ఉన్నాయ‌ని.. ఇటీవ‌ల కూడా టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ప్ర‌క‌టించారు. ఎవ‌రినీ ఒత్తిడి చేయ‌బోమ‌ని.. కానీ వ‌స్తామంటే మాత్రం పార్టీలో చేర్చుకుంటామ‌ని చెప్పారు. దీంతో జగన్ అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. వ‌చ్చే మునిసిప‌ల్ ఎన్నిక‌ల నాటికి ఈ ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇక‌, ఇప్ప‌టి వ‌రకు జ‌గ‌న్‌, వైఎస్ కుటుంబాల‌కు ఫేవ‌ర్ గా ఉన్న ఓటు బ్యాంకు కూడా మారుతున్న సంకే తాలు క‌నిపిస్తున్నాయ‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఒక‌ప్పుడు ప్ర‌తి ఇంట్లోనూ వైసీపీ మాట వినిపించేది ఇప్పుడు వినిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఈ ప్ర‌భావం మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌పై చూపించే అవకాశం ఉంటుంది. మ‌రో చిత్రం ఏంటంటే.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు కూడా ఇక్క‌డ ఖ‌చ్చితంగా అమ‌లు చేస్తున్నారు. నిజానికి ఇత‌ర జిల్లాల కంటే కూడా ముందుగానే ఇక్క‌డ అమ‌ల‌వుతున్నాయి. సో.. మొత్తంగా జ‌గ‌న్‌కు.. పులివెందుల డైల్యూట్ అవుతోంద‌న్న‌ది టీడీపీ నేత‌లు చెబుతున్న మాట‌.

Tags:    

Similar News