లోక్ సభలో మంట పుట్టించిన ప్రియాంక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ గాంధీల వారసురాలు ప్రియాంకా గాంధీ లోక్ సభలో చేస్తే ప్రసంగాలు అయితే చర్చకు నోచుకుంటున్నాయి.

Update: 2026-07-29 03:17 GMT

కాంగ్రెస్ ఎంపీ గాంధీల వారసురాలు ప్రియాంకా గాంధీ లోక్ సభలో చేస్తే ప్రసంగాలు అయితే చర్చకు నోచుకుంటున్నాయి. గత పార్లమెంట్ సెషన్స్ లోనూ ఆమె కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా చూస్తే పబ్లిక్ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజి విషయంలో నిరోధించేందుకు కేంద్రం తీసుకుని వచ్చిన సవరణల బిల్లు మీద చర్చలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ అయితే అధికార ఎన్డీయే ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. అదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో కొత్తగా విద్యా శాఖ మంత్రి అయిన ప్రహ్లాద్ జోషీ మీద కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అవి సభలో దుమారమే రేపాయి. ఆమె మాటలతో అధికార ఎన్డీయే నుంచి భారీ నిరసన వ్యక్తం అయింది.

ఆనాటి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ :

ఇదిలా ఉంటే లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్ర విమర్శలు చేశారు. బిల్కిస్ బానో ఉదంతాన్ని అలాగే మహిళల భద్రతను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. ప్రహ్లాద్ జోషి నియామకంపై ఆమె మాట్లాడుతూ మహిళల పట్ల ప్రభుత్వ వైఖరిపై సభలో ప్రశ్నలు లేవనెత్తారు. అయితే దీని మీద బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇది వ్యక్తిగత దూషణ అని ప్రియాంకా గాంధీ బేషరతుగా ప్రహ్లాద్ జోషీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కొత్త విద్యా మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా మండిపడ్డారు. తన మీద ప్రియాంకా గాంధీ నిరాధారమైన ఆరోపణలతో లోక్ సభను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రియాంక్గ మీద తగిన చర్యలు తీసుకోవాలని జోషి డిమాండ్ చేశారు.

ఎవరీ బిల్కిస్ బానో :

ఇదిలా ఉంటే ప్రియాంకా గాంధీ ప్రస్తావించిన బిల్కిస్ బానో ఎవరు అన్నది ఇపుడు చర్చ సాగుతోంది. బిల్కిస్ బానో 2002 గుజరాత్ మత అల్లర్ల సమయంలో దారుణమైన సామూహిక అత్యాచారానికి కుటుంబ హత్యలకు గురైన బాధితురాలు. ఈ కేసులో సుదీర్ఘ న్యాయపోరాటం జరగగా దోషుల ముందస్తు విడుదలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భిణీ అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది ఆమె మూడేళ్ల కూతురుతో సహా కుటుంబ సభ్యులు 14 మంది హత్య జరిగింది. ఈ కేసులో నిందితులకు మద్దతుగా ప్రహ్లాద్ జోషీ మాట్లాడారు అన్నది ప్రియాంకా గాంధీ ఆరోపణగా ఉంది. ఇదే మాటను పార్లమెంట్ బయట విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ కూడా అన్నారు.

ఆయన నియామకం తప్పు :

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకాన్ని తప్పుపడుతూ రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలను సమర్థించారని అలాంటి వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం తప్పు అని ఆయన విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలు ఇవ్వడంపై రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అయితే తనపై చేసిన ఆరోపణలను కొత్త విద్యా శాఖ మంత్రిప్రహ్లాద్ జోషి తీవ్రంగా ఖండించారు. నిరాధార ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తానికి పార్లమెంట్ లోపల ప్రియాంకా గాంధీ బయట రాహుల్ గాంధీ ప్రహ్లాద్ జోషీని గట్టిగా టార్గెట్ చేయడమే ఇపుడు చర్చగా మారింది.

Tags:    

Similar News