ఎర్రకోట సాక్షిగా మోడీ వరాల జల్లులు.. లక్షల్లో ప్రయోజనాలు!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ

Update: 2023-08-15 09:19 GMT

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఎర్రకోట సాక్షిగా దేశ ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. ఈ సందర్భంగా పలు కీలక పథకాలు తెరపైకి తెచ్చారు. మరి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా కొత్త పథకం రాబోతోందని తెలిపారు.

అవును... పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా నూతన పథకాన్ని తీసుకొస్తున్నట్లు మోడీ ప్రకటించారు. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చేలా కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. దీనివల్ల రూ.లక్షల్లో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

ఇదే సమయంలో చౌక ధరల్లో లభించే జనరిక్‌ మందులు అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా జన ఔషధి కేంద్రాల సంఖ్యను 10వేల నుంచి 25వేలకు పెంచుతున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. మార్కెట్‌ లో రూ.100కు దొరికే మందులు.. జన ఔషధి కేంద్రాల్లో రూ.10-15కే లభిస్తున్నట్లు తెలిపారు.

ఇదే క్రమంలో సంప్రదాయ కళాకారులకు చేయూతనందించేందుకు వీలుగా విశ్వకర్మ యోజన పేరుతో కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల నుంచే ఈ పథకం ప్రారంభించనున్నామని తెలిపారు. దీనికోసం తొలి విడతగా రూ.13వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు.

Read more!

ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేసిన మోడీ... "మీరు మళ్లీ నన్ను ఆశీర్వదిస్తే.. వచ్చే ఏడాది ఆగస్టు 15న మళ్లీ వస్తా. ఎర్రకోట నుంచి మన దేశ విజయాలను చాటిచెప్తా" అని అన్నారు.

మోడీ ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు:

2047లో మనం 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను చేసుకోబోతున్నాం. అప్పటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిష్కృతం కావాలి.

అవినీతి, వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. కుటుంబం చేత, కుటుంబం కోసం, కుటుంబానికి మేలు అన్నట్లుగా తయారయ్యాయి.

అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి. దాన్ని సమూలంగా తుదముట్టించాలి. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలి. అందులోభగంగా అక్రమాస్తుల జప్తు 20 రెట్లు పెరిగింది.

ప్రస్తుతం మనం ప్రపంచంలోనే ఐదో ఆర్థికశక్తిగా ఉన్నాం. అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నేను గ్యారెంటీ ఇస్తున్నా.

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. గత ఐదేళ్ల కాలంలో 13.5 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉంది.

రెండు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేయాలనేది నా కల. మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యాన్ని జీ20 దేశాలు గుర్తించాయి.

Tags:    

Similar News