‘జస్ట్ ఆస్కింగ్’ ఈ ఇద్దరు ఎక్కడ కలిశారు?

‘జస్ట్ ఆస్కింగ్’ అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఆదివారం ప్రధాని మోదీతో కలిసిన ఫొటోను షేర్ చేశారు.;

Update: 2025-09-21 16:57 GMT

సోషల్ మీడియాలో ఓ ఫొటో ఉదయం నుంచి బాగా వైరల్ అవుతోంది. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ బీజేపీపైన ప్రధాని మోదీపైన విమర్శలు గుప్పించే బహుబాషా నటుడు ప్రకాష్ రాజ్ కు చెందిన ఆ ఫొటోపై నెటిజన్లు చాలా కామెంట్లు చేస్తున్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ తాజా ఫొటోకు క్యాప్షన్ జోడించినా, అదే ప్రశ్న నెటిజన్ల నుంచి ఆయనకు ఎదురవడం గమనార్హం. ప్రధాని మోదీతో ప్రకాష్ రాజ్ దిగిన ఫొటోను ఆయన స్వయంగా అప్ లోడ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీని తీవ్రంగా వ్యతిరేకించే ప్రకాశ్ రాజ్ ఆయన ఫ్యాన్ ఎప్పుడు అయ్యారంటూ నెటిజన్లు వరుస ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

‘జస్ట్ ఆస్కింగ్’ అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఆదివారం ప్రధాని మోదీతో కలిసిన ఫొటోను షేర్ చేశారు. అంతేకాకుండా ‘ఆయనను ఎయిర్ పోర్టులో కలిశాను. అయితే మా మధ్య మాటలేమీ పెగల్లేదు’ అంటూ పోస్టు చేశారు. బీజేపీ వ్యతిరేకిగా ముద్రపడి ప్రధాని మోదీపై ఒంటికాలిపై లేచే ప్రకాష్ రాజ్ ఆయన పక్కనే నిల్చొని ఫొటో తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏ మీడియాలోనూ కనిపించని ఈ అరుదైన ఘటన ఎప్పుడు జరిగింది? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం కనిపించింది.

అంతేకాకుండా ప్రకాష్ రాజు కూడా ఆయనను కలిశాను, ఏమీ మాట్లాడలేదు.. అని చెప్పడంతో ప్రధానిని కలిశాక ఏమీ మాట్లాడకుండా ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా ప్రధాని పక్కన కేవలం ప్రకాష్ రాజ్ మాత్రమే కనిపించారు. సెక్యూరిటీ అధికారులు, ప్రొటోకాల్ సిబ్బంది ఇలా ఏ ఒక్కరూ కనిపించలేదు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన ఫొటో నిజమా? అబద్దమా? ఆయనేమైనా తప్పుదారి పట్టించేలా ఈ ఫొటో షేర్ చేశారా? అంటూ మరికొందరు లోతుగా ఆరా తీశారు. అయితే ఫొటోను దీర్ఘంగా పరిశీలిస్తే ప్రకాష్ రాజ్ చెప్పినట్లు ప్రధాని మోదీని విమానాశ్రయంలో కలవడంలో ఎంత మాత్రం నిజం లేదని తేలిపోయింది. ప్రధాని కటౌట్ ముందు నుంచి ఫొటోకు పోజు ఇచ్చిన ప్రకాష్ రాజ్ దాన్ని షేర్ చేసినట్లు నెటిజన్లు గుర్తించారు.

2019 ఎన్నికల నుంచి ప్రధాని మోదీపైన, బీజేపీపైన తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్న ప్రకాష్ రాజ్ షేర్ చేసిన ఫొటోలో మోదీ చిత్రం సహజంగా అందరినీ ద్రుష్టిని ఆకర్షించింది. "నేను మోదీ వ్యతిరేకిని, అమిత్ షా వ్యతిరేకిని" అంటూ ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగా చెప్పుకున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ ఉన్నట్టుండి ప్రధానికి ఫ్యాన్ అయ్యారా? అన్న అనుమానం ఆ చిత్రం చూస్తే కలిగిందని అంటున్నారు. కర్ణాటకకు చెందిన రచయిత్రి గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ బీజేపీని మరింతగా ద్వేషించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ‘జస్ట్ ఆస్కింగ్’ అన్న క్యాప్షన్ తో ఆయన ప్రజా సమస్యలను సోషల్ మీడియాలో చర్చకు పెట్టేవారు.

ఒక సందర్భంలో ప్రధాని మోదీ రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారు. మోదీకి "ఇన్సోమ్నియా" (నిద్రలేమి) అనే జబ్బు ఉందేమోనని, ఆయనకు చికిత్స అందించాలని బీజేపీ నేతలకు సూచించారు. ఇంకా, మోదీ నరనరాల్లో దేశభక్తి కాకుండా కేవలం ఎన్నికలే ప్రవహిస్తాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక నోట్ల రద్దు సమయంలోనూ ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీతో ఉన్న ఫొటోను ఆయన స్వయంగా షేర్ చేయడం నెటిజన్లను ఆకర్షించింది.

Tags:    

Similar News