సజ్జన్నార్ కు కఠిన పరీక్ష.. ప్రభాకర్ రావును నేరుగా విచారణ

ఆ హోదాలోనే ఉన్నప్పుడు అతని టీం రాజకీయ నాయకులు.. న్యాయమూర్తులు.. వ్యాపారవేత్తలు.. జర్నలిస్టులు.. ఇతర ప్రముఖుల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాప్ చేశారన్నది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ.;

Update: 2025-12-21 05:22 GMT

సినిమాల్లో కొన్ని సీన్లు చూసినప్పుడు వాస్తవ జీవితంలో ఇలాంటివి సాధ్యమేనా? అన్న సందేహాలు కలుగుతాయి. నిజమే.. పలు రీల్ సీన్లు రియల్ జీవితంలో అస్సలు సాధ్యమే కాదు. కానీ.. కొన్ని సందర్భాలు మాత్రం అందుకు మినహాయింపుగా మారుతుంటాయి. తాజాగా తెలంగాణలో చోటు చేసుకోనున్న ఆ సీన్ ఈ కోవకే వస్తుంది. తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి తెలిసిందే.

ఇందులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న టి. ప్రభాకర్ రావు ఆషామాషీ వ్యక్తి కాదు. పోలీసు శాఖలో అతడో శిఖరం లాంటోడు. అతని టాలెంట్ గురించి పలువురు ఐపీఎస్ లు కథలు కథలుగా చెబుతారు. అవి మంచివా.. చెడ్డవా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసుకు నచ్చిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణల్ని ఎదుర్కొంటున్నప్పటికి.. ఒకప్పుడు తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి చీఫ్ గా వ్యవహరించారన్నది మర్చిపోకూడదు.

ఆ హోదాలోనే ఉన్నప్పుడు అతని టీం రాజకీయ నాయకులు.. న్యాయమూర్తులు.. వ్యాపారవేత్తలు.. జర్నలిస్టులు.. ఇతర ప్రముఖుల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాప్ చేశారన్నది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ కేసు తెర మీదకు వచ్చి.. ఇందుకు బాధ్యుడైన ప్రభాకర్ రావు గురించి ఆరా తీసే నాటికి ఆయన అమెరికాలో ఉండటం తెలిసిందే. అక్కడి నుంచి హైదరాబాద్ తెప్పించటానికి చాలా కాలమే పట్టింది.

తనపై అక్రమ కేసులు పెట్టినట్లుగా అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టిన ప్రభాకర్ రావు.. ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోవాల్సి వచ్చింది. అమెరికాలో ఉన్న ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో డిసెంబరు 12న హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు విచారణకు.. దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించారు. ఆయన్ను గతంలో విచారించిన సిట్ అధికారులు.. ఆయన విచారణకు సహకరించటం లేదని పేర్కొనటం తెలిసిందే.

ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స వ్యవస్థకు బాస్ గా వ్యవహరించిన పోలీసు ప్రముఖుడ్ని విచారించటం మామూలు విషయం కాదు. ఇప్పటివరకు ఆయన్ను విచారించింది ఏసీపీ.. డీసీపీ.. జాయింట్ సీపీ స్థాయి అధికారులు మాత్రమే. అందుకు భిన్నంగా తాజాగా మరో ఆసక్తికరపరిణామం చోటు చేసుకోనుంది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా సుపరిచితులు.. తెలుగు రాష్ట్రాల్లో మాస్ పాలోయింగ్ ఉన్న పోలీసు ఉన్నతాధికారిగా సజ్జన్నార్ కు పేరుంది. అలాంటి సజ్జన్నార్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును స్వయంగా ప్రశ్నించనున్నారు. ఈ తరహా పరిణామం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పాలి. ఇప్పటివరకు పలు దఫాలుగా విచారణకు హాజరైన ప్రభాకర్ రావు నోటి నుంచి ఎలాంటి సమాచారాన్ని పోలీసులు బయటకు తెప్పించలేకపోయారని చెబుతారు. మరి.. సజ్జన్నార్ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News