చిరంజీవికి రాజకీయం అంటే బిజినెస్... పోసాని సంచలన వ్యాఖ్యలు!

ప్రధానంగా ప్రచార కార్యక్రమాలు, ఆ సభల్లో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోతుంది

Update: 2024-05-08 10:44 GMT

ఎలక్షన్ కోడ్ రావడానికీ, పోలింగ్ తేదీకీ ఈసారి కాస్త ఎక్కువ సమయం ఉండటంతో ఏపీలో రాజకీయాలు గతంలో అంత హాట్ హాట్ గా లేవనే కామెంట్లు వినిపించాయి! అయితే... నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.. పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలవ్వడంతో ఏపీ రాజకీయాల్లో అసలు సిసలు రసవత్తరత మొదలైపోతుంది.

ప్రధానంగా ప్రచార కార్యక్రమాలు, ఆ సభల్లో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోతుంది. కాకపోతే గతంలో ప్రత్యర్థులు ప్రజలకు మేలు చేసిందేమీ లేదు అని విమర్శిస్తూ ఎన్నికల్లో ఓట్లు అడిగేవారు.. ఇప్పుడు జగన్ మాత్రం తన వల్ల మేలు జరిగితేనే ఓటు వేయమని కోరుతున్నారు. అది తప్ప మిగతా రచ్చ రచ్చ అంతా కామన్ గానే సాగుతుందని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... పిఠాపురంలో పవన్ ను గెలిపించాలని.. అతడు మంచి చేస్తాడని.. చట్టసభల్లో ప్రజలకోసం పోరాడతాడని, అవసరమైతే కలబడతాడని.. ఇంట్లో ఆఖరి వాడిగా పుట్టినా ప్రజలకు మేలు చేసేవిషయంలో ముందుంటాడని.. అందువల్ల పిఠాపురం ప్రజలు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి పవన్ కల్యాణ్ ని గెలిపించాలి అని కోరుతున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

దీంతో... పిఠాపురంలో జనసేనానికి మెగాస్టార్ మద్దతు కూడా లభించినట్లే అనే విషయంపై స్పష్టత వచ్చేసింది. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి స్పందించారు. ఇందులో భాగంగా... పవన్‌ ను గెలిపించమని చిరంజీవి ఎలా అడుగుతారు? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో... ప్రజారాజ్యం పార్టీ నాటి విషయాలనూ గుర్తు చేశారు!

Read more!

అవును... పవన్ కు ఓటు వేయాలని కోరుతూ పిఠాపురం ప్రజలను చిరంజీవి కోరడంపై పోసాని స్పందించారు. ఇందులో భాగంగా... చిరంజీవికి ప్రజలంటే లెక్కలేదని.. ప్రజాసేవ అంటూ పార్టీ పెట్టి మూసేశాడని.. సినిమాల్లాగే రాజకీయాల్ని ఆయన వ్యాపారంలా చూశాడని.. అందుకే 18మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి అమ్మేశాడని అంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే క్రమంలో... 18 ఎమ్మెల్యేలను ఇచ్చినప్పటికీ చిరంజీవి ఏనాడైనా రాష్ట్ర ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించారా? అని ప్రశ్నించిన పోసాని.. ఇప్పుడు పవన్‌ ని గెలిపించమని ఎలా అడుగుతారంటూ ఫైరయ్యారు. ఒకప్పుడు దేశం మొత్తం మీద ఒకటి తెలంగాణలో, మరొకటి యూపీలో రెండే రెండు ఎంపీ సీట్ల నుండి బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు పోసాని.

దాని కారణం అప్పట్లో వాజ్‌ పేయి, అద్వానీ కష్టపడి పనిచేసిన విధానం అని.. ప్రజాసేవపై వారికున్న కమిట్ మెంట్ ఫలితం అని అన్నారు! కానీ 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ చిరంజీవి మాత్రం తన పార్టీని కాంగ్రెస్‌ లో కలిపేశారని.. ఇక రాజకీయాల్లోకి రానని చెప్పి, ఇప్పుడు మళ్ళీ జనసేన తరపున ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు.

నాడు ప్రజారాజ్యం సమయంలో చిరంజీవిని నమ్మిన ఎంతోమంది కాపుల్లు బలైపోయారని.. అనంతరం వారికి వారే నచ్చచెప్పుకుని కాస్త కుదురుకున్నారని పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News