ఔను.. ఇండ‌స్ట్రీ ఎటు? తెలంగాణ‌లో పొలిటిక‌ల్ సైలెంట్‌!

`యాక్ష‌న్‌.. క‌ట్‌..``ల‌కు మాత్ర‌మే ఒక‌ప్పుడు ప‌రిమిత‌మైన తెలుగు సినీ ఇండ‌స్ట్రీ రాజ‌కీయంగా కూడా దూ కుడు చూపిస్తున్న‌ విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో 2018, 2014 ఎన్నికల స‌మ‌యంలో తెలంగాణ‌లో సినీ ఇండ‌స్ట్రీ.. ఒక‌వైపే చూసింది.;

Update: 2023-07-30 06:32 GMT

``యాక్ష‌న్‌.. క‌ట్‌..``ల‌కు మాత్ర‌మే ఒక‌ప్పుడు ప‌రిమిత‌మైన తెలుగు సినీ ఇండ‌స్ట్రీ రాజ‌కీయంగా కూడా దూ కుడు చూపిస్తున్న‌ విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో 2018, 2014 ఎన్నికల స‌మ‌యంలో తెలంగాణ‌లో సినీ ఇండ‌స్ట్రీ.. ఒక‌వైపే చూసింది. అగ్ర‌నాయ‌కులు అంద‌రూ దాదాపు కేసీఆర్ వైపు ఉన్నారు. బ‌హిరంగంగానే కొంద‌రు కేసీఆర్‌ను స‌మ‌ర్థించ‌గా.. మ‌రికొంద‌రు.. తెర‌చాటున ఆయ‌న‌కు అనుకూలంగా చ‌క్రం తిప్పారు. ఇది .. అప్ప‌టి ఎన్నిక‌ల‌కు క‌లిసి వ‌చ్చింది.

మ‌రి ఇప్పుడు మూడు మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఎటు వైపు ఉన్నాయ‌నేది ఆస‌క్తిగా మారింది. స‌హ‌జంగానే అధికార పార్టీవైపు మొగ్గు చూపేందుకు కొంద‌రు రెడీగానే ఉన్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం.. ఎవ‌రు లీడ్లోకి వ‌స్తారు? ఎవ‌రు అధికారం చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌నే లెక్క‌లు వేసుకుని.. దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాల‌నే వ్యూహంలోనూ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు.. ఏపీ నుంచి కూడా రాజ‌కీయ ఒత్తిళ్లు ఉన్నాయి. త‌మ రాష్ట్రంలోనూ సినిమాలు నిర్మించాల‌నే ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్ర‌మంలో అక్క‌డ కూడా రాజ‌కీయంగా సినిమా వాళ్ల అవ‌స‌రం.. సినిమా వాళ్లకు పార్టీల అవ‌స‌రం రెండు ఉన్నాయ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇండ‌స్ట్రీ పాత్ర కీల‌కంగా మారింది. అలాగ‌ని బ‌య‌ట‌కు బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేసే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీ ఎటు ఉంటుంది? ఎలాంటి అడుగులు వేస్తుంది? అనేది ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం అయితే.. తెలుగు ఇండ‌స్ట్రీలో అగ్ర క‌థానాయ‌కులు త‌ట‌స్థంగా ఉన్నామ‌ని చెబుతున్నా.. ఎన్నిక ల‌కు ముందు వీరి మ‌ద్ద‌తు త‌మ‌కే ద‌క్కుతుంద‌ని అధికార పార్టీ నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు. ముఖ్యంగా సెటిల‌ర్ల ఓట్లు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇండ‌స్ట్రీ ప్ర‌భావం చూపుతుంద‌ని.. లెక్కలు వేసుకున్నారు. దీనికితోడు గ‌తానికి భిన్నంగా రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పోటీ కూడా తీవ్రంగా ఉండ‌డంతో ఇప్పుడు ఇండ‌స్ట్రీవైపు నాయ‌కులు చూపు సారిస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఇండ‌స్ట్రీ ఏం చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News