ఎఫ్-1 విద్యార్థుల ముందున్న పెను సవాళ్లు ఇవీ..

అయితే చేతిలో ఉద్యోగ ఆఫర్ లేనప్పుడు సొంత దేశానికి వెళ్లడం అనేది ఇప్పుడు ఒక ‘జూదం’లా మారింది. ముఖ్యంగా కుటుంబ వేడుకలు, చెల్లెలి పెళ్లి వంటి అనివార్య కారణాల వల్ల ఇండియా వెళ్లాలనుకునే విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.;

Update: 2025-12-28 10:30 GMT

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. పాపం ఇప్పుడు అమెరికాలో అష్టకష్టాలు పడుతున్న భారతీయుల పరిస్థితి ఇలానే తయారైంది. ట్రంప్ రోజుకో నియమం.. మారిన ఇమిగ్రేషన్ నిబంధనలతో విద్యార్థులు, ఉద్యోగులకు దిన దిన గండం నూరేళ్ల ఆయుష్యులా మారింది. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసి కెరీర్ ప్రారంభించాలని ఆశపడే ప్రతీ విద్యార్థికి ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ఒక కీలక దశ. అయితే చేతిలో ఉద్యోగ ఆఫర్ లేనప్పుడు సొంత దేశానికి వెళ్లడం అనేది ఇప్పుడు ఒక ‘జూదం’లా మారింది. ముఖ్యంగా కుటుంబ వేడుకలు, చెల్లెలి పెళ్లి వంటి అనివార్య కారణాల వల్ల ఇండియా వెళ్లాలనుకునే విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

చట్టం ఏం చెబుతోంది.?

చట్టపరంగా చూస్తే.. ఒక విద్యార్థి వద్ద వాలిడ్ ఈఏడీ (ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యూమెంట్) కార్డు, కాలేజీ నుంచి ప్రయాణ అనుమతి (డీఎస్ఓ సైన్) ఉంటే ప్రయాణం చేయవచ్చు. అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. కాలేజీ అధికారులు కేవలం మీ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో మాత్రమే చూస్తారు. కానీ మిమ్మల్ని తిరిగి అమెరికాలోకి అనుమతించాలా? వద్దా? అనే తుది నిర్ణయం సీబీపీ (కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్) అధికారుల చేతుల్లో ఉంటుంది.

పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద ఎదురయ్యే ప్రశ్నలు

తిరిగి అమెరికా చేరుకునేటప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే ప్రధాన ప్రశ్న ఒకటి ఉంటుంది.. ‘మీరు అమెరికాకు ఎందుకు తిరిగి వస్తున్నారు?’ అని.. మీ దగ్గర ఉద్యోగ ఆఫర్ ఉంటే నేను ఫలానా కంపెనీలో చేరడానికి వస్తున్నానని ధైర్యంగా చెప్పవచ్చు. ఉద్యోగం లేకపోతే మాత్రం .. ‘నేను ఉద్యోగం వెతుక్కోవడానికి వస్తున్నాను’ అని చెప్పాల్సి ఉంటుంది. ఇదే చెబితే అధికారులకు మీ మీద అనుమానం కలిగించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేనప్పుడు మీరు అమెరికాలో ఎలా ఖర్చులను భరిస్తారు వంటి ప్రశ్నలు ఎదురైతే సమాధానాలు చెప్పడం చాలా కష్టమవుతుంది.

పెరిగిన స్క్రీనింగ్.. వీసా రద్దు భయాలు

ఇటీవలి కాలంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింతగా కఠినమయ్యాయి. ఒకవేళ అధికారికి మీ ఉద్దేశంపై అనుమానం కలిగితే అక్కడికక్కడే వీసాను రద్దు చేసే అధికారం వారికి ఉంటుంది. సోషల్ మీడియా స్క్రీనింగ్, గతంలో మీ స్టేటస్ వంటివన్నీ తనఖీ చేసే అవకాశం ఉంది.

ఇండియాలో వీసా స్టాంపింగ్ సమస్యలు

ఒకవేళ మీ వీసా గడువు ముగిసి ఉండి ఇండియాలో స్టాంపింగ్ కోసం వెళ్లాల్సి వస్తే పరిస్థితి మరింత జఠిలం. ఉద్యోగం లేకుండా వీసా ఇంటర్వ్యూకి వెళ్లడం రిస్క్ తో కూడుకున్న పని. కాన్సులేట్ అధికారులు ‘ఉద్యోగం లేని వ్యక్తికి ఓపీటీ వీసా ఎందుకు ఇవ్వాలి?’ అని ప్రశ్నించే అవకాశం ఉంది. పైగా ప్రస్తుతం అపాయింట్ మెంట్ లు దొరకడం కూడా కష్టంగా మారింది.

విద్యార్థుల కోసం కొన్ని సూచనలు

అత్యవసరమైతేనే ఇండియా రావాలి. అంతే తప్పా రిస్క్ తీసుకోవద్దు.ఇండియా వెళ్లలోపు కనీసం ఒక ఆఫర్ లెటర్ సంపాదించడానికి ప్రయత్నించాలి. కనీసం మీరు మీ రంగానికి సంబంధించిన ఏదైనా స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నట్లు ఆధారాలు ఉంటే కొంత సేఫ్టీ ఉంటుంది. ఓపీటీలో మీకు అనుమతించిన 90 రోజుల నిరుద్యోగ గడువులో ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో లెక్క చూసుకోండి.

భావోద్వేగాల పరంగా కుటుంబ వేడుకలకు ఇండియా రావడం అవసరమే.. కానీ ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఎఫ్1 స్టేటస్ రిస్క్ లో పడకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. చేతిలో ఉద్యోగం ఉన్నప్పుడు ప్రయాణం చేయడం ఎప్పుడూ సురక్షితంగా నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News