ఎన్ని గంటలు పని చేసామన్నది కాదన్నయ్య.. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు!
అయితే.. ఈ స్టేట్ మెంట్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. జీవితంలో జాబ్ తప్ప మరేమీ ఉండదా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.;
వారానికి ఎన్ని గంటలు పని చేయాలి అనే విషయంపై ఇటీవల తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. వారానికి 70 గంటలు పని చేయాలని ఒకరు, కాదు కాదు.. 90 గంటలు పనిచేయాలని మరొకరు చెప్పుకొచ్చారు. వాళ్లంతా కంపెనీల యజమానులు! అయితే.. ఈ స్టేట్ మెంట్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. జీవితంలో జాబ్ తప్ప మరేమీ ఉండదా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
పైగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ గంటలు పనిచేస్తున్న జాబితాలో టాప్ లో 2లో ఉన్న భారతీయులు, ఆదాయం విషయంలో మాత్రం లాస్ట్ లో ఉన్న పరిస్థితి! తక్కువ గంటలు పనిచేసినా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న వారి జాబితాలో అమెరికా, స్విట్జర్లాండ్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ముందంజలో ఉన్నాయి! ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి ఓ పక్క ఉద్యోగులు వారానికి 70 గంటలు పని చేయాలని సూచిస్తుంటే.. అదే సంస్థ సహ వ్యవస్థాపకుల్లో మరొకరైన ఎస్.డి. శిబులాల్ మాత్రం ప్రతి వారం ఎక్కువ గంటలు పనిలో ఉండటం కంటే.. చేసే పనిపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఎక్కువ సేపు పనిచేయడం కంటే పనిలో నాణ్యత ముఖ్యమని తెలిపారు.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన శిబులాల్... ఎక్కువ సమయం పని చేయడం కంటే ఆ పనిలో నాణ్యత చాలా ప్రధానమని అనుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం తను ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడే ఉండాలి తప్ప, పరధ్యానంగా ఉండలేను. సెల్ ఫోన్ లో నన్ను నేను పరధ్యానంలో ఉంచలేను.. నేను మరే ఇతర ఆలోచనలతోనూ పరధ్యానంలో ఉండలేని.. ఉండకూడదు అని వెల్లడించారు!
ఇదే సమయంలో.. వ్యక్తిగత, వృత్తిగత, ప్రజా జీవితం మధ్య సమయాన్ని కేటాయించేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందని.. వారి అవసరాల మేరకు ప్రాధాన్యతలు మారతాయని వెల్లడించారు. అయితే.. కేటాయించిన సమయంలో మాత్రం అక్కడే 100% జీవించాలని.. 2014 వరకూ మూడేళ్ల పాటు ఇన్ఫోసిస్ కంపెనీ సీఈఓ గా పనిచేసిన శిబులాల్ తెలిపారు.
సమయపాలన విషయంలో ఎవరి పర్సనల్ అభిప్రాయాలు, ప్రాధాన్యతలు వారికి ఉంటాయని అన్నారు. కాగా... గతంలో వారానికి 70 గంటలు పని చేయాలని నారాయణమూర్తి చెప్పగా.. 90 గంటలు పని చేయాలని ఎల్ & టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. వీరిద్దరి అభిప్రాయలపైనా తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
కాగా... ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ గంటలు పని చేస్తున్న దేశాల జాబితాలో చైనా (48.5 గంటలు) టాప్ లో ఉండగా.. వారి నెలకు సరాసరి సంపాదన రూ.2,73,690గా ఉంది. అయితే.. ఎక్కువ పని గంటల విషయంలో చైనా తర్వాత స్థానంలో ఉన్న భారత్ (46.7 గంటలు)లో సంపాదన మాత్రం సరాసరిన రూ.32,000 ఉండటం గమనార్హం! మరోవైపు అమెరికాలో 34.2 గంటలు మాత్రమే పని చేసి రూ.5,60,520 సంపాదిస్తుంటే.. ఆ తర్వాత స్థానంలో స్విట్జర్లాండ్ (42 గంటలు - రూ.5,45,490) ఉంది!