పట్టుబడ్డాక పలుబడి కబుర్లు లేవ్... సూటిగా చెప్పిన సీపీ సజ్జనార్!
అవును... నూతన సంవత్సర వేడుకలకోసం హైదరాబాద్ మహా నగరం సిద్ధపడుతోంది. ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని అంటున్నారు.;
నూతన సంవత్సర వేడుకలకు ఇంకా మధ్యలో రెండు రోజులే మిగిలి ఉంది! డిసెంబర్ 31 రాత్రి వేడుకల కోసం ఎవరి స్థాయిలో వాళ్లు ప్లాన్స్ చేసుకుంటున్నారు. మరోవైపు నగరంలో ఈవెంట్ల పోస్టర్లు, ప్రమోషన్ కార్యక్రమాలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ రాత్రి సందడి ఎలా ఉండబోతుందో ట్రైలర్స్ చూపించినట్లు పబ్లిసిటీలు జరుగుతున్నాయి! మరోపక్క డ్రంక్ & డ్రైవ్ విషయంలో పోలీసుల నుంచి బిగ్ అలర్ట్ వస్తున్నాయి. ఈ సమయంలో సీపీ సజ్జనార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... నూతన సంవత్సర వేడుకలకోసం హైదరాబాద్ మహా నగరం సిద్ధపడుతోంది. ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని అంటున్నారు. జీరో డ్రగ్స్ విధానమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను సీపీ సజ్జనార్ ఆదేశించారు. ఇదే సమయంలో.. డ్రంక్ అండ్ డ్రైవ్ చర్యల విషయంలో తగ్గేదేలే అని చెబుతున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ వీసీ సజ్జనార్ ఆసక్తికర పోస్ట్ ఒకటి పెట్టారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారుతుంది!
ఇందులో భాగంగా... "మా డాడీ ఎవరో తెలుసా..? మా అంకుల్ ఎవరో తెలుసా..? అని మా అధికారులను అడగొద్దు. మీ ప్రైవసీకి మేము మర్యాద ఇస్తాం.. వాహనం పక్కన పెట్టి, మీ తేదీ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం" అని ట్వీట్ చేశారు సజ్జనార్. దీంతో.. డ్రంక్ & డ్రైవ్ లో పట్టుబడినవారి పలుకుబడి కబుర్లకు ఛాన్స్ లేదంటూ తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. దీంతో.. సిటీలో డ్రంక్ & డ్రైవ్ కి జనాలు దూరంగా ఉండాలని అంటున్నారు!
కాగా... ఇప్పటికే నగరం లోని పబ్ లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మొహరించినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్ మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపైనా కచ్చితమైన నిఘా ఉంటుందని.. గత రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి కదలికలను సిటీ పోలీసులు నిశితంగా గమనిస్తున్నారని వెల్లడించారు.
ఇదే సమయంలో.. ప్రధానంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సిటీలో డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పిన సజ్జనార్... జీరో డ్రగ్స్ విధానమే లక్ష్యంగా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రగ్స్ వినియోగాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్ లు, హోటళ్లు, రెస్టారెంట్లు కచ్చితంగా రాత్రి 1 గంటకే మూసివేయాలని సజ్జనార్ సూచించారు.