అప్పటి భీమవరం కమిషనర్ కు షాకిచ్చిన ఏపీ హైకోర్టు
పురపాలక కమిషనర్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. అంతేకాదు.. ఘాటు వ్యాఖ్యలతో పాటు.. భారీ ఫైన్ విధించి..ఆ మొత్తాన్ని వ్యక్తిగతంగా చెల్లించాలంటూ షాకిచ్చింది.;
పురపాలక కమిషనర్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. అంతేకాదు.. ఘాటు వ్యాఖ్యలతో పాటు.. భారీ ఫైన్ విధించి..ఆ మొత్తాన్ని వ్యక్తిగతంగా చెల్లించాలంటూ షాకిచ్చింది. ఒక భవనానికి ఇచ్చిన అనుమతుల విషయంలో కోర్టును తప్పుదారి పట్టిస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించటమే కాదు.. ‘న్యాయానికి గంతలు కట్టొచ్చు కానీ న్యాయమూర్తులకు కాదు’ అంటూ తలంటింది. అసలేం జరిగిందంటే..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఒక నిర్మాణ అనుమతుల అంశంపై గతంలో అప్పటి పట్టణ కమిషనర్ గా వ్యవహరించిన అధికారి అనుమతులు ఇచ్చారు. అయితే.. వాణిజ్య భవనంగా ఇవ్వాల్సిన అనుమతిని డొమెస్టిక్ అనుమతులు ఇచ్చారు. నిజానికి అక్కడ నిర్మిస్తున్నది కమర్షియల్ బిల్డింగ్ అయినప్పటికి నివాస భవనంగా అనుమతులు మంజూరు చేశారు. దీనిపై దాఖలైన అభ్యంతర పిటిషన్ పై విచారణ సాగింది.
ఈ సందర్భంగా కమిషనర్ వాదనలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు మండిపడుతూ.. భవన యజమాని వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నా.. దాన్ని నివాస భవనమంటూ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడుతూ.. ఈ తీరును సరికాదని స్పష్టం చేసింది. ఇందుకు సదరు కమిషన్ కు షాకిస్తూ.. రూ.2.50లక్షల భారీ మొత్తాన్ని ఖర్చుల కింద చెల్లించాలని పేర్కొంది. దీన్ని వ్యక్తిగత హోదాలో చెల్లింపులు జరపాలని స్పష్టం చేసింది.
అదే సమయంలో నివాస భవనం కోసం అనుమతులు తీసుకొని కమర్షియల్ బిల్డింగ్ నిర్మించిన భవన యజమానులకు సైతం రూ.2.5 లక్షల ఖర్చులను చెల్లించాలని స్పష్టం చేసింది. నిజానికి అంతకు ముందు ఇదే అంశం మీద కింది కోర్టు విధించిన రూ.50వేల ఫైన్ ను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాము విధించిన మొత్తాన్ని రెండు వారాల వ్యవధిలో హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫైన్ మొత్తాన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మూగ.. అంధుల సంక్షేమం కోసం వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్.. న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ దర్మాసనం స్పష్టం చేసింది.