పాలిటిక్స్ లో ఇమిటేషన్స్ ఇగోస్ పనిచేయవు బాస్ !

రాజకీయం అన్నది పూర్తిగా ప్రజలతో ముడిపడి ఉన్న అంశం. చాలా మంది అనుకునేది ఇది చాలా తేలికగా చేయవచ్చు

Update: 2024-04-29 03:46 GMT

రాజకీయం అన్నది పూర్తిగా ప్రజలతో ముడిపడి ఉన్న అంశం. చాలా మంది అనుకునేది ఇది చాలా తేలికగా చేయవచ్చు. కానీ పాలిటిక్స్ అన్నది వెరీ వెరీ టఫ్ సబ్జెక్ట్. రాజకీయం చేసే వారిని మొత్తానికి మొత్తం జనాలు స్కానింగ్ చేస్తారు. ఒకసారి కానీ వారికి నచ్చినన్ని సార్లు.

మౌనంగా ఉన్నారని జనాలు ఏమి చెబితే వింటున్నారు అని అనుకుంటే పొర్పాటే. అసలైన మైండ్ గేం జనాలే ఆడతారు. నాయకుడి బాడీ లాంగ్వేజ్ నుంచి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూస్తారు. బయట ఏమి మాట్లాడుతున్నాడో మాత్రమే కాదు అతని మైండ్ లో ఏమి ఉంది అన్నది కూడా ఆలోచించే చాతుర్యం ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న ఒక నిరక్షరాస్య ఓటరుకు ఉంది.

అదే భారతదేశం ప్రజాస్వామ్యం గొప్పతనం. ఈ దేశంలో బలమైన నాయకులమని అధికారం శాశ్వతం అని అనుకున్న వారిని ఎందరిలో ఓడించి ఇంటికి పంపించిన చరిత్ర భారతీయ ఓటరుది. ఆసేతు హిమాచలం ఒకే విధంగా తీర్పు ఇవ్వడం భిన్న మతాలు జాతులు వర్ణాలు వర్గాలు ఉన్న ఈ దేశంలోనే సాధ్యపడుతోంది. ఇది విదేశీయులను సైతం అట్రాక్ట్ చేస్తోంది.

ఇదంతా ఎందుకు అంటే రాజకీయాలలో రాణించేందుకు ఏ అర్హత ఉండాలి అంటే ఒక్కటే మాట. ప్రజలకు నచ్చినట్లుగా ఉండడమే. వారి కోసం నిరంతరం కష్టపడడమే. వారి చుట్టూనే తమ ఆలోచనలు కేంద్రీకరించి పనిచేయడమే. ఇంతకు మించిన షార్ట్ కట్ రూట్ మరోటి లేదు.

Read more!

ఎందుకంటే రాజకీయాలకు దగ్గర దారులు ఉంటే పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు సెల్యూలాయిడ్ మీద హీరోయిజం చూపిస్తూ వెలిగిపోయే బొమ్మలూ అపారమైన ధనరాశులను తమ వద్ద ఉంచుకున్న అపర కుబేరులు ఏనాడో అందలాలు ఎక్కేవారు. అంతే కాదు వారే అక్కడ శాశ్వతంగా ఆ పదవులలో ఉండిపోయేవారు.

కానీ అలా జరగడం లేదు అంటే డబ్బు పలుకుబడి పేరు ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఏ ఒక్క మెట్టునూ ఎక్కించలేవని స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. మరి ఎలా అంటే జనాలకు దగ్గర కావడమే. వారి మనసు తెలుసుకుని ప్రవర్తించడమే. ఇక రాజకీయాల్లో ఇమిటేషన్లు అసలు పనిచేయవు.

ఫలనా వారు తమ ఇంట్లో ఉన్నత పదవిలో ఉన్నారని భావించి ఆ కుటుంబ సభ్యులు తాము కూడా అదే ఇంటి పేరు కదా ఎందుకు రాజకీయంగా హిట్ కాకూడదు అనుకుంటే అసలు కుదరదు. హావ భావాలను లేదా తమ కుటుంబంలోని పెద్ద నాయకులను ఇమిటేట్ చేస్తూ జనాల ముందుకు వచ్చినా వారు కళ్ళార్పకుండా చూస్తూ వినోదం చిత్తగిస్తారు తప్ప అందలాలకు మాత్రం దారి చూపించరు.

అదే విధంగా ఇగోతో రాజకీయాల్లోకి వచ్చినా వారికి గుణపాఠం చెబుతారు. తాము ఫలానా వారు నాయకుడిగా ఉండకూడదని పంతం పట్టి రాజకీయాల్లోకి వచ్చినా కూడా జనాలు అసలు ఒప్పరు. తమకు ఎంతో పలుకుబడి ఉందని తామెందుకు ఉన్నత ఆసనాలు అధిరోహించకూడదు అంటే అది కూడా వట్టి వాదనగానే జనాలు కొట్టి పారేస్తారు.

4

రాజకీయాల్లో ఎవరి ఇగోస్ నో సాటిస్ ఫై చేయడానికో జనాలు అందలాలు అప్పగించరు. వారిది ఎంతసేపూ డైరెక్ట్ రూటే. తమకు నాయకుడు ఏమి చేయగలడు, ఆయన సమర్ధత ఏమిటి. ఆయన ఆలోచనలు ఏమిటి ఇవే వారు ఆలోచించి మార్కులు వేస్తారు. ఎదిగిన నాయకుల మీద ఎన్నో విమర్శలు ఉండవచ్చు. అలాంటి వారికి పదవులు ఎందుకు ప్రజలు ఇచ్చారు అని అనుకోవచ్చు

కానీ ప్రజలు తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. ఆరోపణలు వారికి సంబంధం లేదు. అవి కోర్టులు తేలుస్తాయి. ఫలానా నాయకుడు తమ వరకూ ఏమిటి అన్నదే వారు ప్రమాణంగా తీసుకుంటారు. అందుకే రాజకీయాల్లోకి ఎందరో వచ్చినా సక్సెస్ కాలేకపోతున్నారు. ఏ కొద్ది మందో మాత్రమే ఉన్నత పీఠాలను అధిరోహిస్తున్నారు.

దీనిని బట్టి ఆలోచిస్తే కనుక రాజకీయాలు అన్నవి ఎంతో క్లిష్టమైనవి కష్టమైనవిగా భావించాలి. వాటిని లైట్ తీసుకున్నా లేక తమను ఎక్కువగా ఊహించుకున్నా వారంతా బ్యాక్ బెంచ్ కే పరిమితం అవుతారు. వారు చేసే చర్యలు అన్నీ పిల్లాటగానే జనాలు చూసి సైడ్ చేసి పారేస్తారు. ఇది ప్రతీ ఎన్నికల్లోనూ రుజువు అవుతూ వస్తోంది. ప్రజలను ఎపుడూ తక్కువ చేయకూడదు, ప్రజలే దేవుళ్ళు. ఈ సూత్రం వంటబట్టించుకుంటేనే అందలాలు దక్కేది.

Tags:    

Similar News